New Education Policy: తెలంగాణలో కొత్త విద్యా విధానం
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:15 AM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం ఎన్‌ఈపీ 2020కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ విధానంపై తటస్థంగా ఉంటూ వచ్చిన ప్రభుత్వం, తాజాగా రాష్ట్రానికి ఒక కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది.
కేంద్ర విధానానికి అనుగుణంగా రూపొందించేందుకు కమిటీ
కేశవరావు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటు
అక్టోబరు 30లోపు నివేదిక
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ విధానంపై తటస్థంగా ఉంటూ వచ్చిన ప్రభుత్వం, తాజాగా రాష్ట్రానికి ఒక కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఈ కొత్త విధానం రూపొందించడానికి ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు కేశవరావు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్షుడు ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి ఉన్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కమిటీ చైర్మన్‌కు మరో సభ్యుడిని నియమించుకునే అవకాశం ఉంది. ఈ కమిటీ అక్టోబరు 30లోపు తమ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కోరింది. కొత్త విద్యావిధానం ‘తెలంగాణ రైజింగ్-2027’ లక్ష్యంగా ఉండాలని సూచించింది. ఈ విధానంలో డిజిటల్ బోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, పరిశోధనలు, అంతర్జాతీయ అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే, విద్యాసంస్థలు, పారిశ్రామిక రంగం మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు తగిన సూచనలు ఇవ్వాలని కోరింది. పాఠశాలలు, కళాశాలలు, వృత్తివిద్య, సాంకేతిక విద్యలో అవసరమైన సంస్కరణలను కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది.
విద్యావ్యవస్థను కాషాయీకరణ చేయాలన్న లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఈపీ-2020 తీసుకొచ్చిందని విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ఏకపక్షంగా దీనిని రూపొందించిందని, రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అనేక రాష్ట్రాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9 రాష్ట్రాలు మాత్రమే ఎన్‌ఈపీని పూర్తిగా అమలుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. తెలంగాణ మాత్రం ఇప్పటివరకు తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకుండా తటస్థంగా ఉంది. అయితే, కర్ణాటక, తమిళనాడుల మాదిరిగానే తెలంగాణ కూడా సొంత రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్‌ఈపీలోని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొన్ని ఉపయోగకర అంశాలు తీసుకుని ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానం 2026-27 వచ్చే విద్యా సంవత్సరం అమలులోకి రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News