Employee Unions: ఉద్యోగుల్ని దోషులుగా నిలబెట్టొద్దు
ABN , Publish Date - May 14 , 2025 | 02:38 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు ప్రకటించాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రకటన అలాంటి సంకేతమే ఇచ్చింది
బోన్‌సలు, అదనపు భత్యాలు, వేతనాల పెంపు అడగట్లేదు
బకాయిలనే అడుగుతున్నాం: ఉద్యోగుల జేఏసీ
ఉద్యోగులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం!
ఉద్యోగులు, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం సరికాదు
రాష్ట్ర ఉద్యోగులు, పింఛనుదారుల సమన్వయ కమిటీ
హైదరాబాద్/పంజాగుట్ట, మే13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన.. ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చూపేలా ఉందని ఉద్యోగ సంఘాల ఐకాస ఆరోపించింది. తాము బోన్‌సలు, అదనపు భత్యాలు, జీతాలు పెంచాలని కోరడం లేదని.. పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలు ప్రకటించాలని కోరింది. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంకో నెల గడిస్తే ఆరో డీఏ కూడా వస్తుందని గుర్తుచేసింది. నాంపల్లిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు మాట్లాడారు. ప్రజాప్రయోజనాల విషయంలో ప్రభుత్వాలకు అండగా ఉంటూనే.. ఉద్యోగుల హక్కుల విషయంలో పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచిందని, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొనే సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. తమ 57 డిమాండ్లపై అధ్యయనానికి అధికారుల కమిటీని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 47 ఆర్థికేతర సమస్యలు, పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల బిల్లుల చెల్లింపు, 5 డీఏలు, పీఆర్‌సీ నివేదిక అమలు, ఉద్యోగులకు ఆరోగ్య పథకం, జీవో 317 బాధితులకు బదిలీల్లో అవకాశం కల్పించడంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో 5 తీర్మానాలు చేశామని, వాటిని మంత్రివర్గ ఉపసంఘానికి, అధికారుల కమిటీకి అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించినందున 15న నిర్వహించతలపెట్టిన నిరసనను వాయిదా వేసినట్లు చెప్పారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించినట్లు చెప్పారు.
మాజీ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగుల సమన్వయ కమిటీల పేరుతో ప్రెస్‌మీట్లలో మాట్లాడేటప్పుడు ఉద్యోగుల పక్షపాతులుగా వ్యవహరిస్తే బాగుంటుందని.. ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించవద్దని కోరారు.
వైషమ్యాలు పెంచడం సరికాదు
ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలను పరిష్కరించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదారుల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య సీఎం వైషమ్యాలు పెంచడం సరికాదంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు, మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్, మాజీ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, సి.విఠల్, రాజేందర్, రవీందర్‌రెడ్డి, సుమిత్ర తదితరులు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కమిటీల పేరుతో కాలయాపన వద్దని సూచించారు. ఉద్యోగులకు ధర్నా, నిరసన, సమ్మె చేసే హక్కు ఉంటుందని తెలిపారు. సోనియా మీద కేసు పెడితే టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు రోడ్లపైకి వచ్చి ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు. ఉద్యోగులను చులకనగా చూస్తే సహించబోమని హెచ్చరించారు. త్వరలో గవర్నర్, సీఎం, మంత్రులు, సీఎ్‌సను కలుస్తామని.. పార్టీల నాయకులను కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. తమ వెనక ఏ పార్టీ లేదని.. ఉద్యోగ సంఘాలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.