Share News

అన్ని వర్సిటీల్లో ఒకే పాఠ్యాంశం!

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:09 AM

తెలంగాణ రాష్ట్రం.. లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో ప్రపంచస్థాయిలో పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్‌లో తయారవుతుండగా.. దేశం మొత్తం ఫార్మారంగ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 35 శాతం ఉంది.

అన్ని వర్సిటీల్లో ఒకే పాఠ్యాంశం!

  • ప్రతి పట్టభద్రుడికీ ఉద్యోగమే లక్ష్యం

  • ఉన్నత విద్య పాఠ్యాంశాల్లో మార్పులు

  • 2025-26 నుంచి కొత్త సిలబస్‌

  • సీఎం ఆదేశాల నేపథ్యంలో సంస్కరణలు

  • ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం.. లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో ప్రపంచస్థాయిలో పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్‌లో తయారవుతుండగా.. దేశం మొత్తం ఫార్మారంగ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 35 శాతం ఉంది. ఇలా నగరం ‘ఫార్మా క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు పొందింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఫార్మా కంపెనీల్లో పనిచేసే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్‌లో మొత్తం 900కు పైగా ఫార్మా కంపెనీలు ఉండగా.. మానవ వనరుల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ లైఫ్‌ సైన్సెస్‌ ప్రధానాంశంగా కోర్సుల్లేవు. రాష్ట్రంలో ఏటా వేలాదిమంది పట్టభద్రులు అవుతున్నా.. వారికి ఉద్యోగాల్లేవు. ఒక వైపు కంపెనీలు.. మరోవైపు నిపుణుల కొరత. ఈ రెండింటి మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. రాష్ట్రంలో డిగ్రీ పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు.. సంస్కరణలకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కోర్సుల పాఠ్యప్రణాళికను మార్చనుంది. అలాగే ప్రస్తుతం వర్సిటీల వారీగా వేర్వేరుగా ఉన్న సిలబ్‌సను రద్దుచేసి.. రాష్ట్రమంతటికీ ఒకే సిలబ్‌సను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన తొలి సమావేశం శనివారం ఉన్నతవిద్యామండలిలో జరిగింది. చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు మహమూద్‌, పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటే్‌షలతోపాటు అన్ని యూనివర్సిటీల నుంచి 50 మందికిపైగా సబ్జెక్టుల నిపుణులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబ్‌సను అమలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


సిలబస్‌ కమిటీల ఏర్పాటు

అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కోర్సులకు కొత్త సిలబస్‌ రూపొందించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇది రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం కొత్తగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. మేనేజ్‌మెంట్‌, లా కోర్సుల సిలబస్‌ కమిటీకి చైర్మన్‌గా బాలకిష్టారెడ్డి, బీఎస్సీ సైన్స్‌ కోర్సులకు మహమూద్‌, ఆర్ట్స్‌ కోర్సులకు పురుషోత్తం, ఇంజనీరింగ్‌ కోర్సులకు శ్రీరాం వెంకటేష్‌ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీల్లో విషయ నిపుణులు, పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు, సీసీఎంబీ, ఎన్‌ఐఏ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థల ప్రతినిధులూ ఉంటారు. కొత్త సిలబ్‌సపై త్వరలోనే కమిటీలు నివేదిక అందిస్తాయి. అలాగే వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రం మొత్తానికి ఒకే సిలబస్‌ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఉపాధికి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులపై ఉన్నత విద్యామండలి గత కొద్ది నెలలుగా అధ్యయనం చేస్తోంది. ఈ దిశగా గత ఏడాది బీఎస్సీ (బయో మెడికల్‌సైన్స్‌) కోర్సును కొన్ని వర్సిటీల్లో ప్రవేశపెట్టగా.. విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ కోర్సును అన్ని వర్సిటీల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇదే తరహాలో ఈసారి కొత్తగా ఐదు కోర్సులు ప్రారంభిస్తున్నారు. ఇందులో బీఎస్సీ అనలటికల్‌ ఇన్‌స్ర్టుమెంటేషన్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫారెస్ట్రీ, కంప్యుటేషనల్‌ ఫార్మకాలజీ, ఆస్ర్టో ఫిజిక్స్‌ కోర్సులు ఉన్నాయి. వీటిని వచ్చే ఏడాది అన్ని వర్సిటీల్లో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనుంది. అలాగే డిగ్రీ ప్రవేశాల్లో దోస్త్‌ ద్వారా ఓ కోర్సులో ప్రవేశాలు తీసుకున్నా..ఇతర కోర్సుల్లో ఆసక్తి ఉన్న సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులోనూ కొన్ని మార్పులు చేయాలని, విద్యార్థులకు మరిన్ని ఆప్షన్స్‌ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు సంస్కరణలు తెస్తున్నామని బాలకిష్టారెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..

Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Feb 16 , 2025 | 04:09 AM