CM Revanth Reddy: నీళ్లు.. నిజాలు!
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:42 AM
ఏపీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈనెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు....
అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు
నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైనే చర్చ
బీఆర్‌ఎస్ అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడదాం
ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం
పట్టిసీమను ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం
ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే
దీనిపై అసెంబ్లీలోనే సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
పెండింగ్, ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మన కృషి వివరిద్దాం
పరిషత్తు ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లపైనా చర్చ
మంత్రులతో సీఎం భేటీలో నిర్ణయం.. 29 నుంచి అసెంబ్లీ
పంచాయతీ ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందన
పరిషత్‌లోనూ ఇవే ఫలితాలు సాధించాలని పిలుపు
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈనెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు. జనవరి రెండో తేదీ నుంచి మళ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ప్రధానంగా నీళ్లు.. నిజాలపైనే చర్చించారు. ఈ అంశమే ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో బీఆర్‌ఎస్ చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పి కొడదామన్న నిర్ణయానికి వచ్చారు. నదీ జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడాన్ని తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రశంసించిన వీడియోను మంత్రులకు చూపారు. కృష్ణా నీటి కేటాయింపుల్లో కేసీఆర్ తీరుతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో అనుకున్నారు. ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ నిర్దేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, అనుమతులు లేకుండా ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలనూ ఈ సందర్భంగా వివరించాలని భావించారు. అయితే, ఈ సమావేశాలకైనా కేసీఆర్ వస్తారా..? అన్న చర్చను ఒక మంత్రి లేవదీశారు. ఆయన వస్తారా..? రారా..!? అన్న దానితో సంబంధం లేకుండా నీళ్లకు సంబంధించి వాస్తవాలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచుదామన్న నిర్ణయానికి వచ్చారు.
అన్ని జడ్పీలూ దక్కించుకోవాల్సిందే
పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనా సమావేశంలో చర్చించారు. జిల్లాలు, మండలాలవారీగా సమగ్రంగా ఫలితాలను సమీక్షించారు. మొత్తంగా పంచాయతీ ఫలితాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. మంచి ఫలితాలను సాధించినందుకు మంత్రులను అభినందించారు. ఈ ఫలితాలు.. పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని స్పష్టం చేశారు. అన్ని జడ్పీ పీఠాలూ కాంగ్రెస్ పార్టీ కైవసం కావాల్సిందేనని, పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను పరిషత్, మున్సిపల్ ఎన్నికలనాటికి సరి చేసుకోవాలని మంత్రులకు సూచించారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉన్నందున, అసెంబ్లీలో దీనిపైనా సమగ్రంగా చర్చిద్దామన్న నిర్ణయానికి వచ్చారు. కాగా, పెద్దగా చదువుకోని వారూ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడంపై చర్చ వచ్చింది. చదువుకోకున్నా ప్రజా సమస్యలపై పని చేసి.. వారు ప్రజల మనసులు చూరగొన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే, జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపైనా సమావేశంలో చర్చించారు. వార్డుల పునర్విభజనలో రాజకీయ జోక్యం ఏదీ లేదని, పూర్తిగా అధికారులే చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో వివరించారు. ఉదాహరణకు.. లే అవుట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వేర్వేరుగా నిబంధనలు ఉన్నందున నగరం క్రమపద్ధతిలో విస్తరణ జరగట్లేదని, వాటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా ఒకే తరహా నిబంధనలు అమలవుతాయని వివరించారు. వార్డుల పునర్విభజనలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని సమావేశం స్వాగతించింది.