Illegal Sand Mining: ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డుల్లో తనిఖీలు చెయ్యండి
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:07 AM
రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు.

తనిఖీలకు రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలు’
ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
హైదరాబాద్, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఇసుక లభ్యతపై ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి మంగళవారం గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదే సందర్భంలో భూపాలపల్లి-జయశంకర్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సరిపడా ఇసుక అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తనిఖీ బృందాల్లో ఆర్‌డీవోలు, డీఎస్పీ స్థాయి అధికారులు ఉండాలని, ఆయా బృందాలను రీచ్‌లు, స్టాక్ యార్డులను స్వయంగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ఇసుక మార్కెట్లకు వెళ్లే రహదారులను గుర్తించి పోలీసు, రవాణా శాఖ అధికారులతో రోడ్డు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఈ తనిఖీల కోసం సంబంధిత శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ బి.శివధర్‌రెడ్డి, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్, మైనింగ్ డైరెక్టర్ శశాంక, టీజీఎండీసీ ఎండీ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్ దాడులు.. వాహనాల సీజ్, 32 మంది అరెస్టు
సంగారెడ్డి క్రైం, (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట, బ్యాతోల్ గ్రామ శివారుల్లోని ఇసుక ఫిల్టర్ స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులోని ఇసుక ఫిల్టర్ వద్ద ఐదు ఎక్సకవేటర్లు, 5 ట్రాక్టర్లు, ట్రాలీ, పది ట్రాక్టర్ ఇంజన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాతోల్ శివారులోని ఇసుక ఫిల్టర్ వద్ద 3 ఎక్సకవేటర్లు సీజ్ చేశారు. అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్న 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక ఫిల్టర్ స్థావరాలను ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా ఎస్పీ రూపేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించండి : ఇసుక లారీ సంఘాల జేఏసీ
మన్సూరాబాద్(ఆంధ్రజ్యోతి): ఇసుక లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ సంఘాల జేఏసీ కోరింది. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ సంఘాల జేఏసీ.. మన్సూరాబాద్‌లో మంగళవారం సమావేశమైంది. నర్రి వెంకన్న అధ్యతన జరిగిన సమావేశంలో లారీ సంఘాల నాయకులు సుర్వి యాదయ్య గౌడ్, సలావుద్దీన్ మాట్లాడుతూ ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లను అరికట్టాలని అన్నారు. ఓవర్ లోడ్ నింపే కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయాలని, ఇసుక అమ్మకాలలో బ్రోకర్ వ్యవస్థను నిర్మూలించాలని, ఇసుక రీచ్‌ల వద్ద రవాణా, మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఇసుక పాలసీని కొనసాగించాలని కోరారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News