Share News

Medical Education: వైద్యవిద్య కోసం విదేశాలకు!

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:52 AM

దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ)లో ఎంబీబీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సీటు రాదని తేలిపోయిన విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు వరుస కడుతున్నారు.

Medical Education: వైద్యవిద్య కోసం విదేశాలకు!

  • నిరుటి కన్నా పెరిగిన తెలుగు విద్యార్థుల సంఖ్య

  • ఈసారి తెలంగాణ, ఏపీ నుంచి 4 వేల మంది

  • ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం కొన్ని విదేశీ వర్సిటీల్లో బోధన

  • రూ.30 లక్షల్లోనే ఎంబీబీఎస్‌ పెరుగుతున్న వైద్యులు..

  • వారికి తగ్గుతున్న ఉపాధి

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ)లో ఎంబీబీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సీటు రాదని తేలిపోయిన విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు వరుస కడుతున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు పలు కన్సల్టెన్సీలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గత ఏడాది 3 వేల మంది వరకు వెళితే ఈ ఏడాది ఆ సంఖ్య 3,500-4,000 వరకు ఉంటుందని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. కొన్ని దేశాల్లోని విశ్వవిద్యాలయాలు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలను అమలుచేస్తున్నాయి. ‘ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌’ (ఎఫ్‌ఎంజీఈ) రాసి ఉత్తీర్ణత సాధించే వారి శాతం బాగా పెరిగింది. గతంలో ఇది 20శాతం లోపు ఉండగా ఈ ఏడాది 33 శాతానికి పెరిగినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ రెండు కారణాలతో ఇక్కడి విద్యార్థులు విదేశాలకు క్యూ కడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌, ఫిలిప్పైన్స్‌, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లోని యూనివర్సిటీలు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఆరేళ్లల్లో వైద్యవిద్య కోర్సుతో పాటు ఇంటర్న్‌షి్‌పను పూర్తి చేసేలా నిబంధనలను రూపొందించుకున్నాయి. అలాగే అంగ్లంలోనే వైద్యవిద్య బోధన జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విదేశాల్లోనైతే తక్కువ ఖర్చుతో వైద్యవిద్యను పూర్తిచేసే అవకాశం ఉండటం కూడా ఆవైపు విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేయాలంటే కనీసం రూ.55-60 లక్షలు కావాలి. ఎన్‌ఆర్‌ఐ కోటాలోనైతే రూ.1.25 కోట్ల వరకు అవుతోంది. విదేశాల్లోనైతే కాలేజీ, హాస్టల్‌ ఫీజుతో కలుపుకొని రూ.30 లక్షల్లోనే ఎంబీబీఎస్‌ పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ లెక్కలను బేరీజు వేసుకొని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు మొగ్గుచూపుతున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలపి 63 వైద్య కళాశాలలు ఉండగా, వాటిలో 9వేల వరకు ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. మరో మూడేళ్ల తర్వాత ఏటా కాలేజీల నుంచి పదివేల మంది వరకు ఎంబీబీఎస్‌ వైద్యులు బయటకొస్తారు. ఈ సంఖ్యకు.. విదేశాల్లో చదువు పూర్తిచేసుకొని వచ్చేవారి సంఖ్య అదనం. ఫలితంగా వీరందరికీ ఉపాధి దొరకడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏటా 1350 మంది వరకు దంత వైద్య విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి బయటకొస్తున్నారు. వారికి ఉపాధి దొరక్క ఐటీతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఎంబీబీఎస్‌ వైద్యులకు ఎదురుకానుందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు.


కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం

నిరుటి కంటే ఈసారి మెడిసిన్‌ చదివేందుకు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ముందుగా విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. టైమ్‌పాస్‌ చదువులు వద్దని చెబుతున్నాం. ముఖ్యంగా ఎఫ్‌ఎంజీఈ ఉత్తీర్ణత సాధించకుంటే ఐదారేళ్ల సమయం వృథా అవుతుంది. తల్లిదండ్రులు దళారులను ఆశ్రయించి వారి వలలో చిక్కుకోవొద్దు. దీర్ఘకాలంగా కన్సల్టెన్సీలను నడుపుతున్న వారినే సంప్రదించాలి. పదేళ్లుకు పైగా వైద్యవిద్యను ఆఫర్‌ చేస్తున్న విదేశీ యూనివర్సిటీల్లోనే మెడిసిన్‌ చేయాలి.

- సతీశ్‌, ఎస్‌.జీ కన్సల్టెన్సీ, హైదరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 03:52 AM