Share News

Hyderabad: సంతాన సాఫల్యం మాటున.. గలీజ్‌ దందా

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:10 AM

పిల్లలు పుట్టకపోతే.. చాలా మంది దంపతులు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఈ కేంద్రాలకు బిడ్డల కోసం వచ్చే దంపతుల సంఖ్య భారీగా ఉంటోంది.

Hyderabad: సంతాన సాఫల్యం  మాటున.. గలీజ్‌ దందా

వీర్యకణాలు, అండాలతో వ్యాపారం.. దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళతో అండం ఇవ్వడానికి నగరంలోని ఓ సంతాన సాఫల్య కేంద్రం ఒప్పించింది. భారీగా డబ్బులిస్తామని ఆశ చూపడంతో ఆ మహిళ ఒప్పుకొంది. అయితే.. ఎక్కువ అండాలు విడుదలయ్యేందుకు పలుమార్లు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ ఆరోగ్యం దెబ్బతినడంతో.. ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

బంజారాహిల్స్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకులు ఓ దంపతుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. ఆ దంపతులకు సంతానం కల్గించడంలో విఫలం కావడంతో వారి ఫిర్యాదు మేరకు వైద్యాధికారులు విచారణ జరిపారు. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఆ సెంటర్‌ నిర్వాహకురాలు కాలేజీ విద్యార్థినుల నుంచి అండాలు సేకరిస్తున్నట్లు తేలింది. అక్కడ ఏకంగా జెనిటిక్‌ ల్యాబ్‌ను అనుమతి లేకుండా ఏర్పాటు చేసి.. వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. దీంతో అధికారులు ఆ సమయంలో ఆ సెంటర్‌ను సీజ్‌చేశారు.

  • దంపతులకు బదులుగా.. దాతల వీర్యకణాలు, అండాల వినియోగం

  • గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న దందా

  • ఏజెంట్ల ద్వారా దాతల ఎంపిక

  • దాతల అండాల ఉత్పత్తికి హార్మోన్‌ ఇంజెక్షన్లు

హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పిల్లలు పుట్టకపోతే.. చాలా మంది దంపతులు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఈ కేంద్రాలకు బిడ్డల కోసం వచ్చే దంపతుల సంఖ్య భారీగా ఉంటోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు కనీసం 200 మంది వరకు దంపతులు పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారని అంచనా. ఈ సెంటర్లకు వచ్చే కొందరు మగవారిలో వీర్యకణాల సంఖ్య(కౌంట్‌) తగ్గడం.. ఆడవారిలో అండాల ఉత్పత్తి కాకపోవడం ప్రధాన సమస్యలని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి దంపతుల బలహీనతలను అసరా చేసుకుంటున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు.. ఫర్టిలిటీని వ్యాపారంగా మలచుకుంటున్నాయి.


దాతల నుంచి సేకరణ..

కొన్ని కేంద్రాలు ఐయూఐ, ఐవీఎఫ్‌ పేరుతో దందా చేస్తున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు మహిళల అండాలు, పురుషుల వీర్యకణాల దానంతో చాటుమాటుగా వ్యాపారం చేస్తున్నాయి. యువత నుంచి వీర్యకణాలు, అండాలు సేకరించి.. వాటి సాయంతో దంపతులకు సంతానం కలిగేలా చేసి, సొమ్ము చేసుకుంటున్నాయి. సంతానం కోసం వచ్చిన దంపతుల వద్ద నుంచి వీర్యకణాలు, అండాలను సేకరించి ఐయూఐ, ఐవీఎఫ్‌ ద్వారా సంతానం పొందే అవకాశం కల్పిస్తామని తొలుత నమ్మబలుకుతాయి. ఒకటి, రెండుసార్లు ప్రయత్నం చేస్తాయి. మూడోసారి మాత్రం వారికి తెలియకుండా.. దాత నుంచి సేకరించిన వీర్యకణాలు, అండాలను ప్రవేశపెట్టి సంతానం కలిగిస్తుంటాయి. డీఎన్‌ఎ పరీక్ష చేస్తే కానీ అసలు గుట్టు రట్టు కాదు. సికింద్రాబాద్‌లో సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై ఇలాంటి కేసే ఇప్పుడు నమోదైంది. ఈ కేంద్రం ద్వారా సంతానం పొందిన దంపతులకు పుట్టిన బిడ్డ తమది కాదనే అనుమానంతో డీఎన్‌ఎ పరీక్ష చేయించడంతో అసలు విషయం బయటపడింది.


టార్గెట్‌ యువత?

చాలా మంది ఆర్థిక అవసరాల కోసం వీర్యం, అండాలు దానం చేయడానికి ముందుకు వస్తుంటారు. ఇందుకోసం సంతాన సాఫల్య కేంద్రాలు ఏజెంట్లను నియమించుకుంటాయి. మంచి శరీరపుష్టి ఉండి.. క్రీడాకారుల్లా కనిపించే యువకులను వీర్య దానానికి.. మేలిమిరంగు శరీరచ్ఛాయతో.. చక్కటి ముక్కు, చెవులు, ఆకర్షణీయమైన కళ్లు, ఎత్తు ఉండే యువుతులను అండ దానానికి ఎంచుకుంటాయి. పేదరికంలో ఉండే యువతకు గాలం వేసి.. తమ పని కానిస్తుంటాయి. ఫర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు వీరి నుంచి ఎక్కువ అండాలు, వీర్యకణాలు ఉత్పత్తి అయ్యేలా హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఉదాహరణకు.. యువతుల్లో నెలకు ఒకటి లేదా చాలా అరుదైన సందర్భాల్లో రెండు అండాలు మాత్రమే విడుదలవుతాయి. కానీ, సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. ఇలా ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల అండ దాతలు భవిష్యత్‌లో సంతానానికి దూరం అయ్యే ప్రమాదాలుంటాయని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్మోన్‌ ఇంజెక్షన్లను అతిగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలతో హైపర్‌ సిమ్యులేషన్‌ సిండ్రోమ్‌, ఇన్ఫెక్షన్లు, ఇతర రుగ్మతల బారిన పడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.


ఐయూఐ, ఐవీఎఫ్‌ కీలకం

పిల్లల కోసం వచ్చే దంపతులకు సంతాన సాఫల్య కేంద్రాల్లో రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. అవి.. ఇంట్రా యుటిరైన్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐయూఐ), ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌). గర్భాశయ ముఖద్వారం వద్ద పొర మందంగా ఉండడం, భర్త వీర్యకణాల్లో చురుకుదనం లేకపోతే ఇదే విధానాన్ని అనుసరిస్తామని వైద్యులు పేర్కొన్నారు. ఐవీఎఫ్‌, ఐయూఐ ద్వారా అండాలను అవసరమైన వీర్యకణాలతో సంయోగం చేసి.. మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఇలా చేయడం వల్ల చాలా మంది దంపలతుకు సంతానం కలుగుతుందని వైద్యులు వివరించారు. ఒక్కసారికే గర్భం దాల్చే అవకాశాలు తక్కువ అని.. ఈ ప్రక్రియను నాలుగైదుసార్లు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


లక్షల రూపాయల్లో ఫీజు

‘‘సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగించే పూచీ మాది’’ అని చెప్పుకొనే సాఫల్య కేంద్రాలు రూ.5 లక్షలకు మించి ఫీజులు వసూలు చేస్తుంటాయనే ఆరోపణలున్నాయి. మరికొన్ని కేంద్రాలైతే.. లక్షలు వసూలు చేసి, చేతులెత్తేస్తుంటాయి. ఇంకొన్ని ఏకంగా అనైతిక వ్యాపారానికి పాల్పడుతుంటాయి. వీరిని ఆశ్రయించే దంపతులకు తొలుత సైక్లింగ్‌ పేరుతో ఇంజెక్షన్లు ఇచ్చి, ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత ఐవీఎఫ్‌, ఐయూఐ పద్ధతులను అమలు చేస్తారు. చాలా కేసుల్లో దాతల నుంచి సేకరించిన వీర్యకణాలను, అండాలను రహస్యంగా వినియోగిస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అనుమతి ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు 50-60 వరకు ఉండగా.. అనధికారికంగా 200కు మించి కొనసాగుతున్నట్లు అంచనా. సంతాన సాఫల్యం కోసం పరీక్షలు చేసే జెనెటిక్‌ కేంద్రాలు, జెనెటిక్‌ ల్యాబ్‌లు కూడా స్కానింగ్‌ కేంద్రాల్లో అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. ఇలాంటి కేంద్రాలను వైద్యాధికారులు పట్టించుకోరనే ఆరోపణలున్నాయి.


రికార్డులు ఉండవు..

సంతానం సాఫల్య కేంద్రాలు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రర్‌ చేసుకుని ఉండాలి. నియమనిబంధనలను తూచ తప్పకుండా పాటించాలి. మార్గదర్శకాలకు లోబడి వ్యవహరించాలి. కానీ, క్షేత్రస్థాయిలో చాలా కేంద్రాలు ఈ నియమాలను తుంగలో తొక్కుతున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు, స్కానింగ్‌ సెంటర్లలో అసలు రికార్డులనే నిర్వహించడం లేదు. అనుమతి పత్రాలు అస్సలు కనిపించవు. నిపుణులైన వైద్యుల జాడే కానరాదు. స్కానింగ్‌ యంత్రాలకు మెషీన్‌ నంబర్లు ఉండవు. అయితే.. వీటిని నియంత్రించాల్సిన వైద్యాధికారులు.. అప్పుడప్పుడూ నామమాత్రంగా తనిఖీలు నిర్వర్తిస్తూ.. స్కానింగ్‌ మెషీన్లను సీజ్‌ చేస్తూ.. చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 07:44 AM