Supreme Court: స్పీకర్‌ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా?
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:16 AM
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల
అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ
ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి
‘మణిపూర్ ఎమ్మెల్యేల’పై గతంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు
నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు
నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేయగా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ మూడు పిటిషన్లను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వినోద్ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. అయితే, బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని గత మంగళవారం(4న) పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ కార్యాలయం.. ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం పేర్కొనలేదు.
దీంతో తమకు 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఎమ్మెల్యేలు కోరారు. కాగా, నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించవచ్చా? లేదా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి వివిధ న్యాయస్థానాల్లో ఈ విషయంపై వేర్వేరు తీర్పులు వచ్చాయి. గతంలో మణిపూర్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసులో జస్టిస్ సుభాష్ దేశాయ్, జస్టిస్ ఖోటో హోల్లోహాన్, జస్టిస్ రాజేంద్రసింగ్ రాణా, జస్టిస్ కే మేఘచంద్రతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాత్రం అనర్హత పిటిషన్లపై స్పీకర్ హేతుబద్ధ సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించిందే తప్ప నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. ఇక, మరో కేసులో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే బాధ్యతలు స్పీకర్‌కు అప్పగించాలా? లేదా? అన్న విషయంపై పార్లమెంటే పునరాలోచించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
అనర్హత పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక శాశ్వత ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, తద్వారా నిష్పాక్షికంగా, వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించిన నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యేల కేసు విషయంలో ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనన్న చర్చ సాగుతోంది. కాగా, అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చి న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు నేతృత్వంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడుతో గంటకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ 10 మం ది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు.