Supreme Court: స్థానికతపై ఓ పరిష్కారంతో రండి
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:52 AM
మెడికల్ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశంపై పరిష్కారంతో రావాలని.. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
లేని పక్షంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తాం
వైద్య విద్య సీట్ల వ్యవహారంపై తెలంగాణ
సర్కారుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మెడికల్ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశంపై పరిష్కారంతో రావాలని.. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం హెచ్చరించింది. ఈ నిబంధన వల్ల.. తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు చదివినా స్థానిక కోటా దక్కడం లేదని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిసందర్భాల్లో తెలంగాణవాసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పారామిలటరీ, ఇతర పైవ్రేట్ ఉద్యోగాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పనిచేయాల్సి వస్తోందని, దానివల్ల స్థానికత వర్తించక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించినట్టు తెలిపారు. దీనికి సీజేఐ జస్టిస్ గవాయి.. ఈ విషయంలో మరింత స్పష్టత అవసరమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఎటువంటి సూచనలతో ముందుకు వస్తారో.. తదుపరి విచారణలో తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News