Supreme Court: విద్యాసంస్థల్లో కులవివక్షపై తీసుకున్న చర్యలేమిటి?
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:42 AM
విద్యాసంస్థల్లో కులవివక్షపై వచ్చినఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలను తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
రోహిత్ వేముల తల్లి రాధిక పిటిషన్‌పై విచారణ
న్యూఢిల్లీ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల్లో కులవివక్షపై వచ్చినఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలను తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉన్నత విద్యాసంస్థల్లో సమాన అవకాశాల కేంద్రాల ఏర్పాటుపై కూడా వివరాలను సమర్పించాలని సూచించింది. విద్యాసంస్థలలో కులవివక్షను నిర్మూలించేలా తగిన చర్యలను కోరుతూ రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, ఆదివాసీ విద్యార్థిని పాయల్ తాడ్వి తల్లి అబేద సలీం తాడ్వి దాఖలు చేసిన ‘పిల్’పై శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, దిశా వాడేకర్‌లు... విద్యాసంస్థలలో కుల వివక్షను నిర్మూలించేలా నిబంధనలను అమలు చేయడంలో యూజీసీ విఫలమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2004-2024 మధ్యకాలంలో ఐఐటీల్లోనే 115 ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు. ఈ వాదనలపై నాలుగు వారాలలోగా కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి, నేషనల్ అసె్‌సమెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్‌లకు ఆదేశాలు జారీ చేసింది.