Share News

Electricity in Schools: 5431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:20 AM

తెలంగాణలో మొత్తం 42,901 పాఠశాలలుండగా.. 5,431 బడుల్లో కరెంటు లేదని కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పాఠశాలల స్థితిగతులపై కేంద్ర విద్యాశాఖ

Electricity in Schools: 5431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు

  • బాలికల మరుగుదొడ్లు లేనివి 5,124

  • కంప్యూటర్లు లేని స్కూళ్లు 22%

  • 60ు బడుల్లో ఇంటర్‌నెట్‌ లేదు

  • ఒక్క విద్యార్థీ చేరని స్కూళ్లు 2,097

  • గురుశిష్యుల నిష్పత్తిలో ముందంజ

  • కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మొత్తం 42,901 పాఠశాలలుండగా.. 5,431 బడుల్లో కరెంటు లేదని కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పాఠశాలల స్థితిగతులపై కేంద్ర విద్యాశాఖ 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన అధ్యయనం వివరాలను ఇటివలే వెల్లడించింది. దాని ప్రకారం పలు అంశాల్లో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉండగా, కొన్ని అంశాల్లో మాత్రం వెనకబడింది. ఈ అధ్యయనం ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో అసలు విద్యుత్తు సౌకర్యమే లేని బడుల సంఖ్య 2065 (4.81 శాతం) కాగా.. కరెంటు కనెక్షన్‌ ఉన్నా విద్యుత్తు లేని బడుల సంఖ్య 3366గా ఉంది. మొత్తం బడుల్లో ఇది 7.84ు.

  • రాష్ట్రంలో ప్రత్యేకంగా బాలికల మరుగుదొడ్లు లేని బడుల సంఖ్య 2811గా ఉండగా, 5124 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించినా ఉపయోగంలో లేవు. అలాగే మొత్తం పాఠశాలల్లో 6459 బడుల్లో బాలురకు మరుగుదొడ్లు లేవు.

  • రాష్ట్రంలోని 42,901 బడులకుగాను 33,434 స్కూళ్లలో కంప్యూటర్‌ వసతి ఉండగా.. 9467 పాఠశాలల్లో (22.06ు) లేదు. 25,787 బడుల్లో (60.1ు) ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదు.

  • 1101 బడుల్లో తాగునీటి సౌకర్యం లేకపోగా.. 3139బడుల్లో నీటివసతి ఉన్నా వినియోగంలో లేదు.

  • తెలంగాణలోని మొత్తం 42,901 బడుల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగాను 33,940 పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యశిబిరాలు నిర్వహించగా, 8961 బడుల్లో నిర్వహించలేదు.


14.3 శాతమే..

విద్యార్థి విద్యా జీవితానికి కీలకమైన ప్రాథమిక విద్యలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో 24 శాతం ఉపాధ్యాయులుండగా, మాధ్యమిక పాఠశాలల్లో 28.6, ఉన్నత పాఠశాలల్లో 47.3శాతం మంది ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే ప్రాథమిక విద్యలో అతి తక్కువ ఉపాధ్యాయులున్న రాష్ట్రాల్లో గుజరాత్‌, కర్ణాటక, తెలంగాణ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. గుజరాత్‌లోని మొత్తం బడుల్లో ప్రాథమిక టీచర్ల శాతం కేవలం 8.6శాతంగా ఉండగా.. మాధ్యమిక, ఉన్నత బడుల్లో 56.1ు, 35.3 శాతంగా ఉంది. అలాగే కర్ణాటకలో ఈ శాతాలు వరుసగా 10.9, 34.2, 54.9గా ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలోని మొ త్తం పాఠశాలల ఉపాధ్యాయుల్లో ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 14.3శాతమే ఉండగా, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో 16.0, 69.6శాతంగా ఉన్నారు.


గురుశిష్యుల నిష్పత్తిలో ముందంజ..

ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తిలో తెలంగాణ అనేక రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. రాష్ట్రంలోని 42,901 పాఠశాలల్లో.. 72.93 లక్షల విద్యార్థులు, 3.41 లక్షల ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే తెలంగాణలో సగటున ప్రతి 21 మంది విద్యార్థులకూ ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. విద్యలో, అక్షరాస్యతలో ముందంజలో ఉన్న కేరళలో ప్రతీ 22 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండగా.. ఢిల్లీలో ఆ సగటు 28గా, గుజరాత్‌లో 29గా, కర్ణాటకలో 27, ఆంధ్రప్రదేశ్‌లో 26, తమిళనాడులో 24గా ఉంది. జాతీయసగటు 25:1గా ఉంది. జాతీయ సరాసరితో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉంది.

టీచర్ల సంఖ్యలో ఢిల్లీ టాప్‌..

ఒక్కో పాఠశాలలో సరాసరి ఉపాధ్యాయుల సంఖ్య చూస్తే.. 29 మంది ఉపాధ్యాయులతో ఢిల్లీ ప్రథమస్థానంలో నిలిచింది. 18 మందితో కేరళ రెండోస్థానంలో ఉండగా తెలంగాణలో 8 మంది ఉన్నారు. ఈ విషయంలో జాతీయసగటు 7గా ఉంది. అలాగే పాఠశాలలో సరాసరి విద్యార్థుల సంఖ్యలో కేరళ ప్రథమస్థానంలో ఉంది. అక్కడ ఒక్కో పాఠశాలలో సగటున 396 మంది విద్యార్థులు ఉన్నారు. హరియాణాలో 238 మంది విద్యార్థులు ఉండగా.. బిహార్‌లో 225, తమిళనాడులో 221, గుజరాత్‌లో 214 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్కూళ్లలో సగటున 142 మంది విద్యార్థులు ఉండగా.. తెలంగాణలో ఒక్కో పాఠశాలలో సరాసరి విద్యార్థుల సంఖ్య 170గా ఉంది.


విద్యార్థుల్లేని బడుల్లో 3వ స్థానంలో..

2023-24 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలల సంఖ్యలో పశ్చిమబెంగాల్‌ అగ్రస్థానంలో ఉంది. అక్కడ 3254 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తర్వాత 2167తో రాజస్థాన్‌ రెండోస్థానంలో ఉండగా 2097తో తెలంగాణ తృతీయ స్థానంలో ఉంది. అంటే.. రాష్ట్రంలోని 2097 బడుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అలాగే తెలంగాణలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 5985 ఉన్నాయి. ఈ జాబితాలో 13,198 బడులతో మద్యప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉండగా, 12,611 స్కూళ్లతో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో, 8866 పాఠశాలలతో ఉత్తరప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,10,971 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి.

  • తెలంగాణలో ఒక్కరే టీచర్‌ ఉన్న బడుల్లో 2023-24లో మొత్తం 88,429 మంది విద్యార్థులు చేరారు.

  • సామాజికవర్గాల వారీగా చూస్తే.. తెలంగాణలో ఓబీసీ వర్గం విద్యార్థులు 49.7శాతంగా ఉండగా, జనరల్‌ 24.3 శాతం, 16 శాతం ఎస్సీలు, 15.5ు ముస్లింలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 04:20 AM