Alampur Gurukul School: కలెక్టర్ సార్‌కే సమస్యలు చెబుదాం!
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:22 AM
తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ గోడును ఏకంగా కలెక్టర్ సార్‌కే చెప్పుకొంటామంటూ గురుకుల
జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్
గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర
తాగేందుకు బోరు నీళ్లు.. అన్నంలో పురుగులు
50 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు
విషయం తెలిసి హాస్టల్‌కు అదనపు కలెక్టర్
సమస్యలు పరిష్కరిస్తామని హామీ
అలంపూర్ చౌరస్తా, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ గోడును ఏకంగా కలెక్టర్ సార్‌కే చెప్పుకొంటామంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అన్న విద్యార్థులు అడుగు ముందుకే వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారు అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిభా ఫూలే బాలుర గురుకుల పాఠశాలను ఆరేళ్లుగా ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తున్నారు. 5 నుంచి 10వ తరగతి వరకు 480 మంది, ఇంటర్‌లో 80 మంది కలిపి మొత్తం 560 మంది ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తమకు కనీస సౌకర్యా లు కల్పించాలని 50 రోజులుగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఏకంగా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటామంటూ తొమ్మిదవ, పదవ తరగతికి చెందిన 59 మంది విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. 45 కి.మీ. దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా విద్యార్థులు వినలేదు. సుమారు 9కి.మీ. వరకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. 50 రోజులుగా తాము బోరునీరే తాగుతున్నామని, ఉపాధ్యాయులు మాత్రం ఫిల్టర్ నీళ్లు తాగుతున్నారని, తమకు సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని, దీంతో బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న 16మరుగుదొడ్లను మరమ్మతు పేరిట భవన యజమాని మూసివేయించారని ఆరోపించారు. ఈ మధ్య తాము తింటున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా.. పట్టించుకోవడంలేదని వాపోయారు. మళ్లీ జోక్యం చేసుకున్న ఉండవల్లి, మానవపాడు ఎస్సైలు శేఖర్, చంద్రకాంత్.. మరికొంతమంది పోలీసులు కలిసి.. ఇటిక్యాలపల్లి స్టేజీ వద్ద విద్యార్థులను సముదాయించారు. మీ సమస్యలు వినేందుకు జిల్లా అధికారులే మీ వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చి అతి కష్టంమీద వారిని ఓ డీసీఎంలో ఎక్కించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు. విషయం తెలిసిన అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన 30 మరుగుదొడ్లు నిర్మిస్తామని, తాగునీటి వసతి కల్పిస్తామని, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామని, విద్యార్థుల సమస్యలు వినేందుకు ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News