Share News

Student Tragedy: టీచర్‌ కొట్టాడని.. పాఠశాల భవనంపై నుంచి దూకి..

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:24 AM

బడిలో తన స్నేహితుల ముందు ఉపాధ్యాయుడు చెంపదెబ్డ కొట్టడాన్ని ఆ విద్యార్థి తీవ్ర అవమానంగా భావించాడు. స్కూలు భవనం నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు.

Student Tragedy: టీచర్‌ కొట్టాడని.. పాఠశాల భవనంపై నుంచి దూకి..

  • 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఉప్పల్‌లో ఘటన

  • సీసీ కెమెరాను పట్టుకున్నందుకు పీఈటీ చెంపదెబ్బ

  • నాలుగో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి

ఉప్పల్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): బడిలో తన స్నేహితుల ముందు ఉపాధ్యాయుడు చెంపదెబ్డ కొట్టడాన్ని ఆ విద్యార్థి తీవ్ర అవమానంగా భావించాడు. స్కూలు భవనం నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆ విద్యార్థి మృతిచెందాడు. ఉప్పల్‌ న్యూ భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతుడు 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల సంగారెడ్డి! స్నానం చేయించి.. యూనిఫాం వేసి.. టిఫిన్‌ బాక్సు, బ్యాగుతో బాబును బడికి పంపిన అరగంటకే ఈ దుర్వార్త చెవినపడటంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. బోడుప్పల్‌లోని ద్వారకానగర్‌కు చెందిన ధర్మారెడ్డి-సంగీత దంపతులకు సంగారెడ్డి రెండో సంతానం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం బడిలో తమ అల్లరి చేష్టలు కనిపించకూడదనే ఉద్దేశంతో తోటి విద్యార్థుల సూచన మేరకు సీసీ కెమెరాల యాంగిల్‌ను సంగారెడ్డి మార్చాడు. ఇది తెలిసి వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంజనేయులు, సంగారెడ్డిని మందలించాడు.


శనివారం ఉదయం సంగారెడ్డి బడికి రాగానే కొందరు తోటి విద్యార్థులు అతడిని ఉద్దేశించి ‘నీకు దమ్ముంటే మరోసారి సీసీ కెమెరాను ముట్టుకో చూద్దాం’ అంటూ సవాలు చేశారు. దీంతో సంగారెడ్డి వెళ్లి సీసీ కెమెరాలను కదిలించాడు. విషయం తెలుసుకున్న పీఈటీ ఆంజనేయులు తరగతి గదికొచ్చి సంగారెడ్డిని అందరి ముందు నిల్చోబెట్టాడు. ‘మీ తల్లిదండ్రులను పిలిచి విషయం చెబుతాను.. టీసీ ఇచ్చి పంపిస్తాను’ అని మందలిస్తూ సంగారెడ్డి చెంపపై కొట్టాడు. అందరి ముందూ తనను కొట్టడాన్ని సంగారెడ్డి అవమానంగా భావించి ఏడ్చాడు. ‘అమ్మా.. నన్ను క్షమించు’ అని నోట్‌ బుక్‌లో రాసుకున్నాడు. కొద్దిసేపటికి.. వాష్‌రూమ్‌కు వెళ్ళి ముఖం కడుక్కొని వస్తానని క్లాస్‌ టీచర్‌కు చెప్పి బయటకు వెళ్లాడు. నేరుగా నాలుగో అంతస్తు టెర్ర్‌సపైకి చేరుకొని అక్కడి నుంచి కిందకు దూకాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న సంగారెడ్డిని స్కూలు యాజమాన్యం ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే సంగారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో యాజమాన్యం, స్కూలు నుంచి పిల్లలందరినీ ఇళ్లకు పంపించి వేసింది. మృతుడి తల్లి సంగీత, బంధువులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. పాఠశాల యజమాని, పీఈటీ ఆంజనేయులు కారణంగానే సంగారెడ్డి మృతిచెందాడని.. వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పాఠశాల యజమాని, పీఈటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 23 , 2025 | 04:24 AM