Street Dogs: పేగులు బయటికి వచ్చేలా కరిచాయ్!
ABN , Publish Date - Aug 18 , 2025 | 03:49 AM
నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వీధి కుక్కలు ఆదివారం రెచ్చిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 30 మందిపై దాడి చేసి గాయపరిచాయి. బాధితుల్లో రెండేళ్లు, నాలుగేళ్ల వయస్సు ఉన్న చిన్నారులతోపాటు
నల్లగొండలో ఓ మహిళపై పిచ్చికుక్కల దాడి
తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన బాధితురాలు
రెండేళ్ల బాలుడు, ఓ యువకుడిపైనా దాడి
ఉమ్మడి రంగారెడ్డిలో రెచ్చిపోయిన వీధికుక్కలు
4 ఏళ్ల బాలుడు సహా 27 మందికి కుక్కకాటు
కొడంగల్‌లో చిన్నారి సహా ఏడుగురిపై దాడి
వీధికుక్కల నియంత్రణకు హెచ్చార్సీలో ఫిర్యాదు
నల్లగొండ, పరిగి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వీధి కుక్కలు ఆదివారం రెచ్చిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 30 మందిపై దాడి చేసి గాయపరిచాయి. బాధితుల్లో రెండేళ్లు, నాలుగేళ్ల వయస్సు ఉన్న చిన్నారులతోపాటు వృద్ధులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నల్లగొండకు చెందిన ఓ మహిళ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ 13వ వార్డులోని గిరకబావిగూడెం ప్రాంతంలో పందుల శ్రీదేవిపై దాడి చేసిన వీధి కుక్కలు పేగులు బయటికి వచ్చేంతలా కరిచాయి. శ్రీదేవి తన ఇంటి ముందు ఉండగానే దాడి జరిగింది. బాధితురాలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీదేవితోపాటు నల్లగొండ 13వ వార్డుకే చెందిన వీహాన్(2), వీరేశం(20)పై కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. మరోపక్క, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఒక్క రోజే 27 మంది వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 16 మంది, కొడంగల్‌లో ఓ బాలుడు సహా ఏడుగురు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ చిన్నారి సహా నలుగురు బాధితులు ఉన్నారు.
పరిగిలోని ఖాన్‌కాలనీ, మార్కెట్‌యార్డు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో అశోక్(20), సయ్యద్‌ఖాజాపాషా(65), నాగమణి(60), కె.బుచ్చయ్య(52), బుగ్గన్న(50), ఎండీ హబీబ్(50), తాజాద్దీన్(16), షఫీ(42), అంజయ్య(60), రవి(32), సరోజ(24), రాము పవార్(40), సుదర్శన్(25), అర్జున్(20), భరత్(22), షేక్ షరీఫ్(50) వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. పరిగి, తాండూరు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో బాధితులను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఇక, కొడంగల్‌లోని కార్గిల్ కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఓ బాలుడు, జోగు అనంతయ్య అనే మునిసిపల్ కార్మికుడు సహా ఏడుగురు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం పరిధిలోని కప్పపాహడ్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న జంగలి శశాంక్(4) అనే బాలుడిపై దాడి చేసిన వీధి కుక్క.. ఆ తర్వాత 8వ వార్డులో మరో ముగ్గురిని కరిచింది. శశాంక్‌ను వీధి కుక్క బారి నుంచి రక్షించే ప్రయత్నంలో అతని తాత యాదయ్య కూడా గాయపడ్డారు. శశాంక్, యాదయ్య ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కుల నియంత్రణ అంశంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో ఉండగా దాడి చేసిన వీధి కుక్కలు ఆరుగురిని గాయపరిచాయంటూ సంతోష్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని హెచ్‌ఆర్సీని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ