Share News

Hyderabad: కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక దాడులు

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:37 AM

గ్రేటర్‌ పరిధిలోని పలు కల్లు దుకాణాల్లో ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ బృందాలు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. శేరిలింగంపల్లి పరిధిలోని సిద్ధిక్‌ నగర్‌లో అనుమతి లేని కల్లు దుకాణాన్ని మూయించి, దాని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశాయి.

Hyderabad: కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక దాడులు

  • శాంపిళ్ల సేకరణ.. పరీక్ష కోసం ల్యాబ్‌కు..

  • శేరిలింగంపల్లిలో అనుమతి లేని కల్లు దుకాణం సీజ్‌.. కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలోని పలు కల్లు దుకాణాల్లో ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ బృందాలు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. శేరిలింగంపల్లి పరిధిలోని సిద్ధిక్‌ నగర్‌లో అనుమతి లేని కల్లు దుకాణాన్ని మూయించి, దాని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశాయి. ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రణవి ఆదేశాతో ఎస్టీఎఫ్‌ బృందాలు బాలానగర్‌, మూసాపేట్‌, కైతలాపూర్‌, ముషీరాబాద్‌, కాచిగూడ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో కూడా తనిఖీలు నిర్వహించి, శాంపిళ్లను సేకరించాయి. వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు హైదర్‌నగర్‌, దానికి అనుబంధంగా ఉన్న హెచ్‌ఎంటీ కాలనీ, సర్దార్‌ పటేల్‌ నగర్‌, కేపీహెచ్‌బీలోని భాగ్యనగర్‌ కల్లు దుకాణాలను మూయించివేశారు. అక్కడ కల్లులో నిషేధిత ఆల్ర్ఫాజోలం మత్తు మందు కలిపినట్లు పరీక్షల్లో తేలింది. కల్లు కల్తీకి పాల్పడిన నలుగురు నిర్వాహకులు కూన రవితేజ గౌడ్‌, కూన సాయితేజ గౌడ్‌, నగేష్‌ గౌడ్‌, బట్టి శ్రీనివాస్‌ గౌడ్‌ను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు సీజ్‌ చేసిన కల్లు కాంపౌండ్ల సంఖ్య 5కు చేరింది. హైదరాబాద్‌ పరిఽధిలో 97 కల్లు దుకాణాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. పలువురు నిర్వాహకులు అంతకుమించి ఇష్టానుసారం కల్లు కాంపౌండ్లు నడుపుతున్నట్లు సమాచారం.


కోలుకుంటున్న కల్తీ కల్లు బాధితులు

నిమ్స్‌: నిమ్స్‌, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితుల ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతోంది. శనివారం నిమ్స్‌ నుంచి మరో అయిదుగుర్ని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 25 మందికి చికిత్స అందిస్తున్నామని, వారిలో 10 మందికి డయాలసిస్‌ అవసరమని పేర్కొన్నాయి. గాంధీ ఆస్పత్రిలో మరో 18 మంది చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 05:37 AM