Hyderabad: కోటిన్నర ఇల్లు కట్నం ఇవ్వడం ఇష్టంలేకే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:47 AM
ఆ తల్లికి ఆమె సవతి కూతురు ఆమెకు మళ్లీ పెళ్లిచేసి.. రూ.కోటిన్నర విలువ చేసే ఇంటిని కట్నంగా ఇవ్వాలని తండ్రి ఆలోచన చేస్తుంటే.. ఆ తల్లి ఆలోచన వేరుగా ఉంది! అంత ఖరీదైన ఇంటిని సవతి కూతురుకు ఇవ్వడం ఆ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు.

సవతి కూతురును తన ప్రియుడితో కలిసి చంపిన తల్లి
వివాహేతర బంధం గుట్టు తెలిసిందనీ కక్ష
ఆమె భర్తకు చెందిన రూ.5 కోట్ల ఆస్తిని కొట్టేయాలని ప్రణాళిక
హైదరాబాద్ సిటీ/పీర్జాదిగూడ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఆ తల్లికి ఆమె సవతి కూతురు! ఆమెకు మళ్లీ పెళ్లిచేసి.. రూ.కోటిన్నర విలువ చేసే ఇంటిని కట్నంగా ఇవ్వాలని తండ్రి ఆలోచన చేస్తుంటే.. ఆ తల్లి ఆలోచన వేరుగా ఉంది! అంత ఖరీదైన ఇంటిని సవతి కూతురుకు ఇవ్వడం ఆ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. పైగా గుట్టుగా తన మేనబావతో సాగిస్తున్న వివాహేతర సంబంధం గురించీ ఆ సవతి కూతురికి తెలిసిపోయింది! ఆ బంధాన్ని ఇకముందూ కొనసాగించాలన్నా.. ఇంటిని కాపాడుకోవాలనుకున్నా.. మొత్తంగా భర్తకు ఉన్న రూ.5కోట్ల ఆస్తిని పూర్తిగా తనకే దక్కాలన్నా ఆమె బతికి ఉండకూడదు అని ఆ సవతి తల్లి భావించింది. ఆమె హత్యకు పథకం వేసింది. ఈ మేరకు మేడిపల్లి పరిధిలో వెలుగుచూసిన 26 ఏళ్ల యువతి హత్య కేసులో విస్తుబోయే నిజాలు వెలుగుచూశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. ఖరీదైన ఇంటినీ తీసుకెళుతోందని కక్షగట్టి తన భర్త పీనా నాయక్ మొదటి భార్య కుమార్తె మహేశ్వరిని లలిత హత్యచేసిందని పోలీసుల విచారణలో తేలింది. బోడుప్పల్‌లో నివాసముంటున్న జాటోత్ పీనానాయక్ ఓయూలో లైబ్రేరియన్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు మహేశ్వరి ఉన్నారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెకు విడాకులిచ్చాడు. ఇప్పటి నుంచి కుమారుడు తల్లి వద్దే ఉంటుంటే, కూతురు మహేశ్వరి తండ్రి వద్ద ఉంటోంది. కొన్నాళ్లకు పీనా నాయక్ తనకన్నా వయసులో చాలా చిన్నదైన లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు పుట్టింది. కాగా లలిత తన మేనబావ, సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి రవితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది మహేశ్వరి దృష్టికి రావడంతో అప్పటి నుంచి లలితతో ఆమె సరిగా ఉండటం లేదు. ఇక.. మహేశ్వరికి పెళ్లి చేయాలని నిర్ణయించిన పీనా నాయక్ ఓ సంబంధం కుదిర్చాడు. నిశ్చాతార్థం కూడా జరిగింది. తనకున్న ఆస్తిలో తన బిడ్డ వాటా కింద కోటిన్నర విలువైన ఇంటిని కట్నంగా ఇవ్వడానికి పీనా నాయక్ సిద్ధపడ్డాడు.. అంత ఖరీదు చేసే ఇల్లును కట్నంగా తీసుకెళ్తున్న విషయం నచ్చని సవతి తల్లి లలిత భర్తతో పలుమార్లు గొడవ పెట్టుకుంది. ఎంతకీ భర్త తన నిర్ణయం మార్చుకోకపోవడంతో మహేశ్వరిపై కక్ష పెంచుకుంది. తన ప్రియుడు రవితో కలిసి మహేశ్వరి హత్యకు పథకం వేసింది. ఆ తర్వాత భర్త సంగతి చూద్దామని ప్లాన్ వేసింది.
పాలల్లో మత్తుమందు కలిపి, మెడకు ఉరిబిగించి..
తన పథకంలో భాగంగా ముందుగా మహేశ్వరికి కుదిరిన పెళ్లి సంబంధాన్ని లలిత, రవి చెడగొట్టారు. కొన్నాళ్లకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేశ్వరి తాగే పాలలో మత్తు మందు కలిపారు. ఆ పాలు తాగి ఆమె మత్తులోకి జారుకోగానే ప్రియుడు రవి, అతడి బంధువు వీరన్న సాయంతో లలిత మహేశ్వరి మెడకు ఉరి బిగించి హత్య చేసింది. మృతదేహాన్ని ఒక గోనె సంచీలో వేసుకొని వీరన్న.. కారులో నల్లగొండ జిల్లా శాలిగౌరారం దగ్గరలోని మూసీ పరీవాహక ప్రాంతంలోకి తీసుకెళ్లి పాతిపెట్టారు. ప్లాన్ ప్రకారం మహేశ్వరి ఫోన్ నుంచి లలిత పోన్‌కు ‘‘నేను ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. ఇక ఇంటికి తిరిగి రాను’’ అని మెసేజ్ పెట్టారు.. తర్వాత కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ భర్త పీనా నాయక్‌కు లలిత ఆ మెసేజ్ చూపించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని, ఆమె బతుకేదో ఆమెను బతుకనివ్వండంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భర్తను అడ్డుకుంది. అయితే భార్యకు తెలియకుండా పీనానాయక్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. కూతురు గురించి చెప్పాడు. లలితపై అనుమానం రావడంతో ఆమెను గట్టిగా నిలదీసే సరికి అంతా చెప్పేసింది. లలిత, ఆమె ప్రియుడు రవి, వీరన్నలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News