Share News

UGC: విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి!

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:38 AM

విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం ‘యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)’ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి వెళతాయని ఆందోళన చెందుతోంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కేంద్రానికి లేఖ రాయనుంది.

UGC: విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి!

యూజీసీ ముసాయిదా అభ్యంతరకరం

రాష్ట్రాల హక్కులను హరించడమే

కేంద్రానికి లేఖ రాయనున్న ప్రభుత్వం

వీసీల నియామకాల్లో పాత్రే ఉండదు

ప్రొఫెసర్ల నియామకాల్లో మార్పులు

ముసాయిదాపై ముఖ్యమంత్రికి నివేదిక

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం ‘యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)’ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి వెళతాయని ఆందోళన చెందుతోంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కేంద్రానికి లేఖ రాయనుంది. రాష్ట్రాల హక్కులను హరించడానికే కేంద్రం ప్రభుత్వం ఈ ముసాయిదా రూపొందించినట్లుగా ఉందని ఆరోపిస్తోంది. యూజీసీ తాజాగా రూపొందించిన ముసాయిదాపై అభిప్రాయాలను తెలియజేయాలంటూ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది. యూజీసీ ప్రతిపాదించిన ముసాయిదా అమల్లోకి వస్తే.. వర్సిటీల్లో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉపకులపతు(వీసీ)ల నియామకాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు. ప్రస్తుత విధానం ప్రకారం.. వీసీల నియామకాలకు తొలుత ప్రభుత్వం నుంచి ఒకరు, యూనివర్సిటీ నుంచి ఒకరు, యూజీసీ నుంచి మరొకరు సభ్యులుగా సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తారు. సెర్చ్‌ కమిటీ వీసీ పోస్టుల కోసం ఐదుగురి పేర్లతో జాబితాను ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తుంది. గవర్నర్‌ ఆమోదం తర్వాత వీసీని నియమిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. కానీ, తాజా ముసాయిదా ప్రకారం.. వీసీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదు. సెర్చ్‌ కమిటీల్లో యూజీసీ నుంచి ఒకరు, వర్సిటీ నుంచి ఒకరు, గవర్నర్‌ సూచించే మరో వ్యక్తి ఉంటారు. కమిటీ తన ప్రతిపాదనలను నేరుగా గవర్నర్‌కు పంపిస్తే, గవర్నర్‌ వీసీని ఎంపిక చేస్తారు. ఇక వీసీలుగా ఎవరిని నియమించాలనే విషయంలోనూ యూజీసీ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం.. వీసీ పోస్టుకు అర్హత సాధించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. కానీ, ముసాయిదాలో దీన్ని తొలగించారు. వీసీ పోస్టు కోసం పారిశ్రామికవేత్తలతో పాటు మేధావులు, పరిశోధనా ప్రతినిఽధులు, పాలనా అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. అంటే వర్సిటీల్లో పనిచేయనివారు, ప్రొఫెసర్లు కానివారు ఎవరైనా వీసీలుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.


ప్రొఫెసర్ల నియామకాల్లోనూ..

ముసాయిదాలో మరో ప్రధాన అంశం.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాల్లో మార్పులు. ప్రస్తుతం ఈ పోస్టులకు అర్హత సాధించాలంటే ఒకే సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి. తాజా ముసాయిదా ప్రకారం.. గ్రాడ్యుయేషన్‌, పీజీల్లో ఏ సబ్జెక్టు చదివినా, పీహెచ్‌డీ చేసిన సబ్జెక్టుతో ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధించే అవకాశం ఉంది. అలాగే కాంట్రాక్టు పద్ధతిలో బోధన సిబ్బందిని గరిష్ఠంగా ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నియమించకూడదని పేర్కొన్నారు. యూజీసీ ముసాయిదాను విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు. వర్సిటీలను తమ అధీనంలోకి తీసుకొనే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపిస్తున్నారు.

రాష్ట్రాల హక్కులను హరించడమే..

రాష్ట్రాల హక్కులను హరించడానికే యూజీసీ ఈ ముసాయిదాను రూపొందించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ ముసాయిదాపై అధ్యయనం చేస్తున్నాం. దీనిపై ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తాం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

- బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌

ఇది రాజ్యాంగ విరుద్ధం

యూజీసీ చేయాలనుకుంటున్న మార్పులు రాజ్యాం గ విరుద్ధమైనవి. వర్సిటీలను పూర్తి స్థాయిలో తమ చేతుల్లోకి తీసుకోవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా నిర్ణయం ఉంది. వర్సిటీలపై రాష్ట్రాలకే నియంత్రణ ఉండాలి. కేంద్రం, యూజీసీ తమ అభిప్రాయాలను రుద్దాలని చూస్తున్నాయి. దీన్ని వ్యతిరేకించాలి

- ప్రొఫెసర్‌ లింబాద్రి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్‌


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:38 AM