Share News

Midday Meal: మధ్యాహ్న భోజన ధరలను 50% పెంచాలి!

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:51 AM

ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను 50 శాతం పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ సర్కారుకు సిఫారసు చేసింది. అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించింది.

Midday Meal: మధ్యాహ్న భోజన ధరలను 50% పెంచాలి!

  • ఇంటర్‌ విద్యార్థులకూ భోజనం పెట్టాలి

  • గురుకులాలు, హాస్టళ్లలో శుభ్రతను పెంచాలి

  • సరుకుల కొనుగోలులో మార్పులు చేయాలి

  • నాణ్యతపై వంటవారు, టీచర్లకు శిక్షణ ఇవ్వాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ నివేదిక

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను 50 శాతం పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ సర్కారుకు సిఫారసు చేసింది. అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించింది. ఈ రెండు నిర్ణయాలను అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.191కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను సమర్పించింది. ఇటీవల ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహారం కలుషితమై దురదృష్టకరమైన ఘటనలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులు విశ్వేశ్వరరావు, వెంకటేశ్‌, జ్యోత్న్స శివారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్‌వాడీసెంటర్లను సందర్శించి వివిధ వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపారు.


ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఆహార నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యంలో లోటుపాట్లను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను రూపొందించారు. ‘మధ్యాహ్న భోజన పథకం- ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రతపై సిఫారసులు’ శీర్షికతో సోమవారం నివేదికను సీఎస్‌ శాంతికుమారికి అందజేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పెంచడానికి పలు అంశాలను ప్రస్తావించారు. మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న స్వయం సహాయక సంఘాలకు వారం వారం చెల్లింపులు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లకు అవసరమైన వస్తువులు, సరుకులను ఒకే గొడుగు కింద కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ద్వారా సరుకులను కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. వంటశాల, వస్తువులు నిల్వ చేసే గదులను శుభ్రంగా ఉంచాలని, భోజన నాణ్యత కోసం ఏం చేయాలనేదానిపై ప్రామాణికాలను ఖరారు చేయాలన్నారు. ఈ విషయంలో వంట మనుషులకు, టీచర్లకు శిక్షణ ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 04:51 AM