RRB Group-D: గ్రూప్-డి రైల్వే ఉద్యోగాలపై నేటి నుంచి టి-శాట్‌లో ప్రసారాలు
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:41 AM
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహించబోయే గ్రూప్-డి ఉద్యోగ నియామకాలపై మంగళవారంనుంచి టి-శాట్‌లో ప్రత్యేక ప్రసారాలు అందిస్తున్నామని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
సీఈవో వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహించబోయే గ్రూప్-డి ఉద్యోగ నియామకాలపై మంగళవారంనుంచి టి-శాట్‌లో ప్రత్యేక ప్రసారాలు అందిస్తున్నామని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్-డి పరీక్షల్లో భాగంగా టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం జనవరి నెలలో 32,438 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఆ ఉద్యోగాలకు సంబంధించి మార్చి నెలలో పరీక్ష నిర్వహించబోతుందన్నారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో 3,992 ఉద్యోగాల భర్తీ జరగనుందన్నారు.
పరీక్ష నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ విభాగాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని సీఈవో అన్నారు. జనరల్ సైన్స్, లెక్కలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టులపై సుమారు 200 ఎపిసోడ్‌లు ప్రసారం చేస్తున్నామన్నారు. టి-సాట్ నిపుణ చానల్‌లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, విద్య చానల్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఎపిసోడ్‌లు ప్రసారమవుతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి వివరించారు.