Share News

Southwest Monsoon: రుతుపవనాలొచ్చాయ్‌!

ABN , Publish Date - May 27 , 2025 | 05:04 AM

రాష్ట్ర రైతాంగానికి చల్లని కబురు ముందుగానే అందింది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కొడతాయంటారు. కానీ ఈసారి భిన్న వాతావరణం నెలకొని నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.

Southwest Monsoon: రుతుపవనాలొచ్చాయ్‌!

  • రోళ్లు పగిలే రోహిణి కార్తెలోనే నైరుతి.. 15 రోజుల ముందే రాష్ర్టానికి రాక

  • ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ

  • బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం

  • నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి చల్లని కబురు ముందుగానే అందింది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కొడతాయంటారు. కానీ ఈసారి భిన్న వాతావరణం నెలకొని నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను నైరుతి రుతుపవనాలు తాకినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏటా ఐఎండీ అంచనాల మేరకు జూన్‌ 10నాటికి రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చేవి. కానీ ఈసారి పక్షం రోజులు ముందుగానే రాష్ట్రాన్ని నైరుతి పలకరించింది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించినట్లు పేర్కొంది. ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ద్రోణికి తోడు నైరుతి రుతుపవనాల రాకతో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు రోజులకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.


పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌, హనుమకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో గరిష్ఠంగా 38.2, కనిష్ఠంగా నారాయణపేట జిల్లా గుండ్మల్‌లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు జగిత్యాల జిల్లా ఎండపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సోమవారం అరగంట కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఆఫీసులు ముగించుకొని ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేసమయంలో భారీ వర్షం కురవడంతో బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పటాన్‌చెరువు, బహుదూర్‌పుర, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ ప్రాంతాల్లో 1 సెం.మీ వర్షం కురిసింది. నగరంలో మరో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందన్వెల్లిలో 81.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. కులకచర్ల మండలంలోని తిరుమలాపూర్‌, ముజాహిద్‌పూర్‌ కేంద్రాల్లో తూకం వేయని, వేసిన ధాన్యం బస్తాలు తడిశాయి. కొన్ని బస్తాలు మెలకెత్తాయి. కొడంగల్‌ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ ఉంచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.


ఏపీలోకి ‘నైరుతి’...

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఈ నెల 13న అండమాన్‌కు వచ్చిన రుతుపవనాలు 24న కేరళను తాకాయి. అనూహ్యంగా సోమవారమే రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌ ఐదో తేదీనాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం నెలకొనడంతో పది రోజుల ముందుగానే వచ్చాయి. గత ఏడాది జూన్‌ రెండో తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 05:04 AM