మూడు రోజుల్లో రాష్ట్రానికి నైరుతి
ABN , Publish Date - May 26 , 2025 | 04:38 AM
నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోనికి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్‌లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి.
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
నేడు, రేపు తెలంగాణకు భారీ వర్షసూచన
విశాఖపట్నం/హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోనికి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్‌లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఏపీ, తెలంగాణలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్యభారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆదివారంనాటికి మధ్యమహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిన తర్వాత దాని అవశేషాలు (ఉపరితల ఆవర్తనం) తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ అల్పపీడనంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఇది తర్వాత బలపడి ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది. దీనివల్ల రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, దానికి ఆనుకుని ఒడిశా పరిసరాల వరకు ఈ నెల 27వ తేదీనే విస్తరించనున్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరికొన్ని మోడళ్ల మేరకు సోమవారం తూర్పు మధ్యబంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తర్వాతి రోజు.. అంటే 27వ తేదీన వాయుగుండంగా బలపడనుంది. తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్యంగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్‌లో తీరం దాటుతుంది.
నేడు, రేపు భారీ వర్షాలు
రాష్ట్రంలో సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 29 వరకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్, జనగాం జిల్లా నర్మెట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, నిర్మల్ జిల్లా సారంపుర్ణి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 3సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం, జురాల జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 818అడుగుల మేర నీటి నిల్వ ఉంది.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం