Share News

Smita Sabharwal: క్యాబినెట్‌ ముందుంచాం.. ఏమో తెలియదు!

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:08 AM

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలు, నిర్ణయాలకు సంబంధించిన అంశాలు క్యాబినెట్‌ ముందు పెట్టారా? అని పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నించగా..

Smita Sabharwal: క్యాబినెట్‌ ముందుంచాం.. ఏమో తెలియదు!

  • కమిషన్‌ ప్రశ్నలకు స్మిత సభర్వాల్‌ భిన్న సమాధానాలు

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలు, నిర్ణయాలకు సంబంధించిన అంశాలు క్యాబినెట్‌ ముందు పెట్టారా? అని పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నించగా.. మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో పనిచేసిన స్మితా సభర్వాల్‌ పరస్పర భిన్నమైన సమాధానాలిచ్చారు. మూడు బ్యారేజీల ప్రతిపాదనలకు సంబంధించిన అన్ని అంశాలను క్యాబినెట్‌ ముందు పెట్టామని తొలుత సమాధానమిచ్చిన స్మిత.. జీవో 776లో ఆ ప్రస్తావనే లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయగా మాట మార్చి తనకేం తెలియదని బదులిచ్చినట్లు పీసీ ఘోష్‌ నివేదిక పేర్కొంది. మూడు బ్యారేజీల నిర్మాణంలో స్మిత పాత్ర కీలకమని వెల్లడించింది. సీఎం కార్యదర్శిగా కీలక స్థానంలో ఉండి అనేక అంశాల్లో ఆమె తన విధులను విస్మరించారని, పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘‘మూడు బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. పర్యవేక్షణ, నాణ్యతలోనూ నా పాత్ర లేదు. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే దస్ర్తాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే నా బాధ్యత. జిల్లాల పర్యటనలకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు తెలుపడమే నాకు కేటాయించిన బాధ్యతలు’’ అని విచారణ సందర్భంగా ఆమె జవాబు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. మూడు బ్యారేజీలకు సంబంఽధించి మొత్తం 11 ప్రశ్నలు సంధించగా.. అత్యధిక ప్రశ్నలకు ఆమె ‘తెలియదు’ అని సమాధానమిచ్చినట్లు పేర్కొంది. అయితే, ఆమె చెప్పిన సమాధానాలన్నీ తప్పని పేర్కొన్న కమిషన్‌.. సీఎం ప్రత్యేక కార్యదర్శి హోదాలో నీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆమె రాసిన లేఖలు, జరిపిన సమీక్షలు, ఇచ్చిన ఆదేశాలను నివేదికలో పొందుపర్చింది. ఇన్ని ఆధారాలున్నా.. బ్యారేజీల నిర్మాణంలో తన పాత్ర లేదంటూ ఆమె బుకాయించారని కమిషన్‌ తప్పుపట్టింది.


ష్‌.. ఇప్పుడేం మాట్లాడొద్దు!

  • ఘోష్‌ కమిషన్‌ నివేదికపై విపక్ష నేతల సీరియస్‌ కసరత్తు

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ‘ష్‌.. ఇప్పుడేం మాట్లాడొద్దు.. నివేదిక చదువుతున్నాం’ ..ఇదీ ఆదివారం అసెంబ్లీలో ఎవరిని కదిలించినా వినిపించిన మాట! విపక్ష నేతల వద్దకు వెళ్లినా అదే మాట.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులదీ.. పాత్రికేయులది సైతం అదే బాట!! పరీక్షకు గంట ముందు, పరీక్ష కేంద్రానికి వెళ్లే దారిలో, ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లాక కూడా.. యమా సీరియ్‌సగా చదివేస్తుంటారు కొందరు విద్యార్థులు! ఏడాది మొత్తం చదువునూ ఆ చివరి నిమిషంలో బుర్రలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేస్తుంటారు!! ఆదివారం శాసనసభ ప్రాంగణంలో అలాంటి దృశ్యాలే కనిపించాయి. 600కు పైగా పేజీలున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికనుఉదయం 9.30 గంటల సమయంలో.. అసెంబ్లీ సిబ్బంది ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో అందించారు. ఆ నివేదిక కాపీలను.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగమేఘాలపై ప్రింట్‌ తీయించుకుని, ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్నారు. నివేదికలో ఏయే అంశాలున్నాయి.. ఏ పేజీలో ఏ కీలక అంశం ఉంది.. వాటికి తాము ఎలా సమాధానమివ్వాలి? సభలో తాము ప్రస్తావించిన విషయాలేమిటి? అనే అంశాలపై తీవ్ర కసరత్తు చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా తన చాంబర్‌లో ఏకాంతంగా కూర్చుని నివేదికను ఏకాగ్రతతో చదివారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆసక్తిగా కమిషన్‌ నివేదికను చదివారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై కమిషన్‌ ఎలా స్పందించిందనే అంశంపై వారు దృష్టి సారించారు.


ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌‌మీట్

మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated Date - Sep 01 , 2025 | 04:09 AM