Share News

Elevated Corridor to Srisailam: శ్రీశైలానికి 6 అలైన్‌మెంట్లు

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:04 AM

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు రిజర్వ్‌ ఫారె్‌స్టలో నిర్మించతలపెట్టిన మార్గం అలైన్‌మెంట్లు సిద్ధమయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీలోని శ్రీశైలానికి చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ..

Elevated Corridor to Srisailam: శ్రీశైలానికి 6 అలైన్‌మెంట్లు

  • మన్ననూర్‌ నుంచి పాతాళగంగ వరకు 54 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం

  • రిజర్వ్‌ ఫారె్‌స్టలో ఎలివేటెడ్‌ కారిడార్‌కు పలు రకాల ప్రతిపాదనలు

  • మార్గంలో ఒక టోల్‌ప్లాజా.. రెండు బైపా్‌సలు.. కేంద్రానికి నివేదిక

  • వచ్చే నెల తొలి వారంలో భేటీ.. ఎలివేటెడ్‌ కారిడార్‌వైపే సర్కారు చూపు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు రిజర్వ్‌ ఫారె్‌స్టలో నిర్మించతలపెట్టిన మార్గం అలైన్‌మెంట్లు సిద్ధమయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీలోని శ్రీశైలానికి చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ.. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మార్గానికి సంబంధించి 6 రకాల అలైన్‌మెంట్లతో కూడిన ప్రతిపాదనలు తాజాగా కేంద్రానికి చేరాయి. వీటిపై ఇప్పటికే ఒక సమావేశం జరగ్గా సెప్టెంబరు మొదటివారంలో కీలక భేటీ జరగనుంది. కేంద్రానికి అందించిన నివేదికలో రహదారి స్వరూపంతో పాటు 6 అలైన్‌మెంట్లలో దేనికి, ఎన్ని నిధులు అవసరమవుతాయనే వివరాలను పేర్కొన్నారు. టోల్‌ప్లాజ్‌లు, బైపా్‌సలు, గ్రామాలు ఉన్న చోట నిర్మించతలపెట్టిన ర్యాంపులు, ఘాట్‌లో చేపట్టే రోడ్డు నిర్మాణ అంశాలను కూడా పొందుపర్చారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో చేపడితే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. నివేదికను పరిశీలించి, కేంద్రం ఆమోదం తెలిపితే.. వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌)ను ఖరారు చేసి.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రహదారి పూర్తయి, అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌-శ్రీశైలంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, దూరం కూడా తగ్గనుంది. మార్గం మధ్యలో ఒక టోల్‌ప్లాజా, రెండు బైపా్‌సలు రానున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఏటా భక్తులు పెరుగుతున్నార ని, ఈ మార్గంలో కొత్త రోడ్డు అవసరమన్న విషయాన్ని నివేదికలో తెలిపారు.

ఇదీ విషయం..

తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే హైదరాబాద్‌- శ్రీశైలం- నంద్యాల జాతీయ రహదారే ఆధారం. ప్రస్తుత రోడ్డు రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి వెళ్తుండడంతో ఈ మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు దగ్గర రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాలకు అవకాశం లేదు. ఈ దారిలో 30-40 కి.మీ. కంటే ఎక్కువ వేగం వెళ్లేందుకు వీల్లేదు. వెరసి శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దాదాపు 55 కి.మీ. మేర కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని భావించింది. ఇందుకోసం మన్ననూరు నుంచి పాతాళగంగ వ రకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు అలైన్‌మెంట్‌ను సిద్ధం చేసి గతంలోనే కేంద్రానికి అందించింది. దాన్ని పరిశీలించిన కేంద్రం.. పూర్తి వివరాలను పంపాలని సూచించింది. దీంతో 6 రకాల అలైన్‌మెంట్లను సిద్ధం చేసి, తాజాగా కేంద్రానికి నివేదించింది. ఆ నివేదిక ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది.


ఎలివేటెడ్‌ కారిడార్‌కే మొగ్గు!

మొత్తం ఆరు రకాల అలైన్‌మెంట్లను రూపొందించినప్పటికీ వీటిలో ఎలివేటెడ్‌ కారిడార్‌ ఆమోదయోగ్యంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. 6 అలైన్‌మెంట్లను ఒకదానితో మరొకటి పోల్చుతూ సమగ్ర వివరాలను తెలిపారు. ఉదాహరణకు ఎలివేటెడ్‌ కారిడార్‌ విధానంలో ట్రాఫిక్‌ ఎంత పెరిగినా ఇబ్బంది ఉండదు. భారీ వాహనాలు కూడా వెళ్లొచ్చు. 24 గంటలు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అదే రోప్‌వే విధానంలో అయితే రాత్రి పూట ప్రయాణాలు ఇబ్బంది, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండనుంది. ఇక సొరంగ మార్గంలోనూ భారీ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా మిగిలిన అలైన్‌మెంట్ల గురించి కూడా వివరించారు.

2023 నుంచి ప్రతిపాదనల దశలోనే..

కొత్త అలైన్‌మెంట్ల ప్రకారం ఈ మార్గం మన్ననూరు చెక్‌పోస్టుకు కొంచెం ముందుగా బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై.. ఈగలపెంట తర్వాత ముగుస్తుంది. ఈ మధ్యలో మన్ననూరు, వట్టర్‌పల్లి దగ్గర రెండు బైపా్‌సలను, ఆ తర్వాత ఒకచోట టోల్‌ప్లాజా, రెస్ట్‌ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. ఘాట్‌ రోడ్డు దగ్గర ప్రత్యేకంగా నిర్మాణాలుంటాయి. ఏపీ సరిహద్దు వచ్చే దగ్గర కృష్ణా నదికి కొంచెం పక్కనుంచి ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ వెళ్లనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2022-23 వార్షిక ప్రణాళికలో కేంద్రం తెలంగాణకు మంజూరు చేసింది. అప్పటినుంచి ఇది ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా కదలికలు మొదలయ్యాయి.

ఆ 6 అలైన్‌మెంట్లు ఇవే..

1.మొత్తం 6 అలైన్‌మెంట్లలో రోప్‌వే మొదటిది. ఒక క్యాబిన్‌లో 15 మందిని తరలించే అవకాశం ఉంది. ఈ విధానంలో ప్రయాణ సమయం 3-3.30 గంటలు పట్టనుంది. నిర్మాణ వ్యయం 4,213 కోట్లు అవుతుందని అంచనా.

2.రోప్‌వే 32.45 కి.మీ., మరో 7.70 కి.మీ. రోడ్డు మార్గం ఉండేలా అలైన్‌మెంట్‌. రోప్‌వే నిర్మాణానికి 3,569.5 కోట్లు, రోడ్డు నిర్మాణానికి 385 కోట్లు కలిపి మొత్తం 3,954 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ విధానంలో ప్రయాణ సమయం 4.30 గంటలు పడుతుందని అంచనా.


3.రోప్‌వే 9.4 కి.మీ., ఎలివేటెడ్‌ కారిడార్‌ 35.22 కి.మీ., రోడ్డు మార్గం 7.70 కి.మీ. ఉండేలా అలైన్‌మెంట్‌. ఇందులో రోప్‌వేకు రూ.1,034 కోట్లు, ఎలివేటెడ్‌ కారిడార్‌కు రూ.4,226.4కోట్లు, రోడ్డుకు రూ.385 కోట్లు కలిపి రూ.5,645 కోట్లు అవసరమని తేల్చారు. ఈ విధానంలో ప్రయాణ సమయం 2.30 గంటలు పట్టనుంది.

4.టన్నెల్‌ విధానం. భూగర్భ మార్గం గుండా ప్రయాణించేలా రెండు రకాల అలైన్‌మెంట్లు రూపొందించారు. ఇందులో ఆప్షన్‌-1లో 40 కి.మీ. సొరంగం, ఒక కిలోమీటరు రోడ్డు, టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ విధానంలో దీని నిర్మాణానికి రూ.29 వేల కోట్లు అవసరమని తేల్చారు. ఆప్షన్‌-2లో 33 కి.మీ. సొరంగం, 7 కి.మీ. రోడ్డు ఉంది. న్యూ ఆస్ట్రియన్‌ టన్నెలింగ్‌ విధానంలో రూ.16,200 కోట్ల నిధులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

5.సొరంగం 24 కి.మీ., ఎలివేటెడ్‌ కారిడార్‌ 15 కి.మీ., మరో 7.5 కి.మీ. రోడ్డు విధానంలో నిర్మించేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఈ మార్గాన్ని టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ విధానంలో నిర్మిస్తే రూ.19,455 కోట్లు, న్యూ ఆస్ట్రియన్‌ విధానంలో అయితే రూ.11,775 కోట్లు అవసరమని అంచనా.

6.మొత్తం 54.91 కి.మీ. మార్గంలో 45.19 కి.మీ. మేర 4 వరసలతో ఎలివేటెడ్‌ కారిడార్‌, మరో 9.72 కి.మీ. మేర రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీని నిర్మాణానికి మొత్తం 148 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. ఇందులో అటవీ భూమి 129 హెక్టార్లు, అటవీయేతర భూమి 19 హెక్టార్లు. నిర్మాణానికి సుమారు రూ.7,668 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇందులో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కి.మీ.కు రూ.115 కోట్ల చొప్పున రూ.5,500 కోట్లు, ఘాట్‌రోడ్డు వెడల్పుకు రూ.175 కోట్లు, ఎట్‌గ్రేడ్‌ రోడ్డుకు రూ.195 కోట్లు చొప్పున నిధులు అవసరమని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:04 AM