Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:04 AM
పదేళ్లు తెలంగాణను పరిపాలించి, బీసీ వర్గాలకు ఏమైనా చేశారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

పదేళ్లలో కవితకు బీసీలెందుకు గుర్తుకురాలేదు: సీతక్క
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు తెలంగాణను పరిపాలించి, బీసీ వర్గాలకు ఏమైనా చేశారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రి సీతక్క ప్రశ్నించారు. అధికారం కోల్పోగానే బీసీరాగం ఎత్తుకున్నారని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు ఎందుకు గుర్తుకురాలేదని మంత్రి నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల పట్ల అహంకారంతో వ్యవహరించి.. ఇప్పుడు మమకారం కురిపిస్తే బీసీలు నమ్మేస్థితిలో లేరన్నారు. బీసీ ముసుగుతో కవిత మరో రాజకీయ డ్రామా మొదలుపెట్టారని, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్.. బీసీ మంత్రులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
మూతపడిన అంగన్వాడీల పునరుద్ధ్దరణ
సాంకేతిక కారణాలు, న్యాయపరమైన చిక్కులతో మూతపడిన అంగన్వాడీ కేంద్రాలను తక్షణం పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు కార్పొరేట్ ప్లేస్కూళ్లను మించిపోయేలా పని చేయాలని సూచించారు.