Singur Reservoir: ‘సింగూరు’లో 8 టీఎంసీలు వృథా
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:53 AM
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో మంజీరా వరద ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు.
శాశ్వత మరమ్మతులు చేపట్టని ఫలితం.. పూర్తి సామర్థ్యం నింపితే డ్యామ్‌కు ప్రమాదమే
ఇటీవల స్పష్టం చేసిన నిపుణుల బృందం
30 టీఎంసీలకు 17 టీఎంసీలే నిల్వ
వరదను దిగువకు వదిలేస్తున్న వైనం
మరమ్మతులపై ముందే హెచ్చరించిన ’ఆంధ్రజ్యోతి’
సంగారెడ్డి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో మంజీరా వరద ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఐదు గేట్లు ఎత్తి వరదతో పాటు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న దాదాపు 8 టీఎంసీల నీటిని వృథాగా వదిలేశారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సింగూరు రిజర్వాయర్‌పై కొంతకాలంగా నిర్లక్ష్యపు ఛాయలు అలుముకున్నాయి. తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు పరివాహక ప్రాంత భూములకు సాగునీరు అందిస్తున్న ఈ రిజర్వాయర్‌కు ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు. కానీ ప్రస్తుతమున్న నిల్వ 16.854 టీఎంసీలే. దాదాపు 13 టీఎంసీలను తక్కువగా నిల్వ చేశారు. ఇందుకు ప్రధాన కారణం మరమ్మతులు చేపట్టకపోవడమే. గతంలో ప్రాజెక్టు ఆనకట్టకు బుంగ పడింది. దీనికి తాత్కాలికంగా కంకర చిప్స్ బస్తాలు అడ్డుపెట్టి చేతులు దులుపుకున్నారు. ఇటీవల ప్రాజెక్టుల భద్రతా నిపుణుల బృందం ఈ రిజర్వాయర్‌ను సందర్శించి, పలు లోపాలను ఎత్తిచూపింది. పూర్తి సామర్థ్యం మేరకు నీరు నింపితే కట్టకు ప్రమాదమని హెచ్చరించారు.
శాశ్వత మరమ్మతులపై నిర్లక్ష్యం
సింగూరు ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని ఏడాది కిందట ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇదే విషయంపై ఇటీవల నిపుణుల బృందం అధికారులు కూడా హెచ్చరించారు. ప్రాజెక్టు అధికారులు నీటి నిల్వ తక్కువగా ఉన్నప్పుడు డ్యామ్ కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టకుండా అలసత్వం ప్రదర్శించారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యం కంటే 13 టీఎంసీలు తక్కువగా ఉన్నందున ఇప్పటికైనా శాశ్వత మరమ్మతులు చేపట్టడం అవసరం. గేట్ల లీకేజీ సమస్యలు కూడా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు లేకపోలేదు.
వేసవిలో ఇబ్బందులే..!
మిషన్ భగీరథ పథకం ద్వారా ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సింగూరు ప్రాజెక్టు నీటిని అందిస్తున్నారు. ఇవే నీటిని హైదరాబాద్‌కు మంజీరా పథకం ద్వారా దశాబ్దాల కాలంగా సరఫరా చేస్తున్నారు. సింగూరులో లోటు ఉంటే హైదరాబాద్‌కు నీళ్ల కష్టాలు తలెత్తుతాయి. అందుకే ఎప్పుడూ సింగూరును నిండుకుండలా ఉండేలా చూస్తారు. మొదటిసారి పుష్కలంగా నీళ్లు ఉన్నా నిల్వ చేయలేకపోయారు. ఇక పుల్కల్, చౌటకూర్, అందోల్, మునిపల్లి, సదాశివపేట మండలాల్లో 40 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని అందించడం కూడా కష్టమే అవుతుంది. ఇప్పటికే కాలువల ఆధునీకరణ పేరిట మూడు పంటలకు నీళ్లివ్వలేదు. ఈసారి ప్రాజెక్టులో నీళ్లు లేనందున రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News