Share News

Khammam: అనారోగ్యంతో 10 కి.మీ నడిచి ఆసుపత్రికి వచ్చిన ఆంబోతు!

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:39 AM

అనారోగ్యం బారిన పడిన ఓ అంబోతు దానంతట అదే ఏరియా ఆస్పత్రికి వచ్చింది! ఆస్పత్రి ఆవరణలోనే కదలకుండా ఉంటున్న దానిని 108 సిబ్బంది గమనించి పశువైద్యులకు సమాచారమిచ్చారు.

Khammam: అనారోగ్యంతో 10 కి.మీ నడిచి ఆసుపత్రికి వచ్చిన ఆంబోతు!

  • పశువైద్యులకు సమాచారం ఇచ్చిన 108 సిబ్బంది.. ప్రథమ చికిత్స చేసిన పశువైద్యులు

  • ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఘటన

సత్తుపల్లి/పెనుబల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): అనారోగ్యం బారిన పడిన ఓ అంబోతు దానంతట అదే ఏరియా ఆస్పత్రికి వచ్చింది! ఆస్పత్రి ఆవరణలోనే కదలకుండా ఉంటున్న దానిని 108 సిబ్బంది గమనించి పశువైద్యులకు సమాచారమిచ్చారు. దాంతో పశువైద్యులు వచ్చి దానికి ప్రథమ చికిత్స చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామస్థులు రెండు ఆంబోతులను సంరక్షిస్తున్నారు. వాటిలో 14 ఏళ్ల వయసున్న ఓ అంబోతు బుధవారం 10 కి.మీల దూరంలో ఉన్న పెనుబల్లిలోని ఏరియా ఆస్పత్రి వద్దకు వచ్చి ఆవరణలోనే పడుకుంది. ఆస్పత్రికి వచ్చి వెళ్లే వారు దానిని ఆహారం అందించారు. బుధవారం నుంచి అంబోతు అక్కడే పడుకుని ఉండడం గమనించిన 108 సిబ్బంది పశు వైద్యులకు సమాచారం అందించారు.


దాంతో గురువారం ఉదయం పశువైద్యులు డాక్టర్‌ సృజన, పి.సురేష్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ జమీల్‌లు అక్కడికి వచ్చి ఆంబోతును పరీక్షించి అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. ప్రథమ చికిత్స చేసి ఇంజక్షన్లు ఇచ్చి సెలైన్‌ ఎక్కించారు. గురువారం మధ్యాహ్నానికి ఆంబోతు కోలుకోగా కారాయిగూడెం గ్రామస్థులు ఆసుపత్రి వద్దకు వచ్చి దానిని వాహనంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సృజన మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ కవర్లు, పేపర్లు, చెత్త్తాచెదారం తినడం వల్ల ఆంబోతుకు గ్యాస్టిక్‌ సమస్య వచ్చి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంబోతు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 03:39 AM