Share News

Heatwave Casualties: ఎండ మండింది

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:37 AM

రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా కస్తోచేస్తున్నాయి. ఆదిలాబాద్‌ సిరికొండలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండల కారణంగా వడదెబ్బతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వర్షపాతం కూడా నమోదైంది

Heatwave Casualties: ఎండ మండింది

  • ఆదిలాబాద్‌ సిరికొండలో 45.5 డిగ్రీలు

  • మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

  • వడదెబ్బకు నలుగురి మృతి

  • నేడు రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు వర్షసూచన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాలు శనివారం నిప్పుల కొలిమిని తలపించాయి. కొన్ని జిల్లాల్లో సాయంత్రం అయ్యే సరికి వాతావరణం మారి వానలు బీభత్సం సృష్టించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిరుడు ఏప్రిల్‌ చివరి వారంలో సగటున 45 డిగ్రీలలోపే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఈసారి ఏప్రిల్‌ మూడో వారం నుంచే 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో 45.4, జగిత్యాల జిల్లా రాయుకల్‌, నిజామాబాద్‌ జిల్లా మెండోరలో 45.3, గద్వాల జిల్లా మల్దకల్‌లో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 41.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ వల్ల రాష్ట్రంలో శనివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామానికి చెందిన కొయ్యడ చంద్రమౌళి(45) అనే ఆటో డ్రైవర్‌, రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సయ్యద్‌ అహ్మద్‌(35), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్టపల్లికి చెందిన మిరుపూరి రాజయ్య(65) అనే వ్యవసాయ కూలీ, భద్రాచలం గ్రామ పంచాయతీ 13వ వార్డు మాజీ సభ్యురాలు మడెం లక్ష్మి(58) ఉన్నారు.


ఇక, మెదక్‌ జిల్లా ఎలదుర్తిలో 3.4, వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేట్‌లో 2.6, మర్పల్లిలో 1.9, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం శనివారం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షానికి తుప్రాన్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ రామప్పగుట్టపై ఆరబెట్టిన 40 క్వింటాళ్ల ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. అలాగే, వెల్దుర్తి మండలం ఆరెగూడెంలో ఓ కోళ్లఫారం కూలిపోయి రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు వర్షానికి సంబంధించి ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 09:22 AM