Seethakka: కేటీఆర్‌కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:24 AM
‘సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకాలను ఒక్క గ్రామానికే పరిమితం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భ్రమపడుతున్నారని, ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క విమర్శించారు.
మా రేవంత్.. చింతమడక సీఎం కాదు: మంత్రి సీతక్క
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకాలను ఒక్క గ్రామానికే పరిమితం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భ్రమపడుతున్నారని, ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క విమర్శించారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సోమవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
నూతన పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కన్పిస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వ లేకపోతున్నారని విమర్శించారు. ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలు పెట్టి.... ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ లాగా ఎన్నికల లబ్ధి కోసం తాము పథకాలు అమలు చేయడం లేదన్నారు.