పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు హరీశ్ లేదు: సీతక్క
ABN , Publish Date - Jan 19 , 2025 | 05:02 AM
పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి హరీశ్ రావు లేదని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలపై హరీశ్ రావు వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు.
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి హరీశ్ రావు లేదని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలపై హరీశ్ రావు వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. హరీశ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే నెలల తరబడి జీతాలు రాక పంచాయతీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. 13 మార్చి 2023న పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ల ముందు వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపిన వార్త కథనాలను మరిచారా అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు జీతాలివ్వకుండా అవస్థలు పెట్టి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. పంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వంటి వేల మంది చిరుద్యోగులను కనీసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించలేదని ఆమె ఆరోపించారు. కుటుంబం యూ నిట్‌గా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని తెలిపారు. ఇందులో మహిళలకే తొలి ప్రధాన్యం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.