Share News

Secretariat Promotions: పదోన్నతుల్లో తేడాలెందుకు?

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:08 AM

సచివాలయంలోని కొన్ని విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు చకచకా పదోన్నతులు వస్తుండగా.. సింగిల్‌ యూనిట్‌లో పని చేస్తున్న వారికి పదోన్నతి రావాలంటే కనీసం 7 నుంచి 10 సంవత్సరాల నిరీక్షణ తప్పడం లేదని సచివాలయ అధికారుల సంఘం వాపోతోంది.

Secretariat Promotions: పదోన్నతుల్లో తేడాలెందుకు?

  • ఆర్థిక, న్యాయ విభాగాల్లో సత్వరంగా పదోన్నతులు

  • సింగిల్‌ యూనిట్‌లో పదోన్నతికి పదేళ్లు ఆగాల్సిందేనా?

  • సచివాలయ విభాగాల్లో సమతుల్యత తీసుకురావాలి

  • ప్రభుత్వానికి సచివాలయ అధికారుల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని కొన్ని విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు చకచకా పదోన్నతులు వస్తుండగా.. సింగిల్‌ యూనిట్‌లో పని చేస్తున్న వారికి పదోన్నతి రావాలంటే కనీసం 7 నుంచి 10 సంవత్సరాల నిరీక్షణ తప్పడం లేదని సచివాలయ అధికారుల సంఘం వాపోతోంది. ఇదే విషయమై ఇటీవల ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారు(ఏఎ్‌సవో)ల నియామకం అన్ని విభాగాల్లో ఒకే విధంగా జరుగుతున్నప్పటికీ.. న్యాయ, ఆర్థిక విభాగాల్లో పనిచేసే అధికారులకు వచ్చినంత త్వరగా సింగిల్‌ యూనిట్‌(జీఏడీ)లో పనిచేసే వారికి పదోన్నతులు రావడం లేదు. ఈ క్రమంలో పనిభారం ఎక్కువగా ఉన్న తమకు పదోన్నతులు రావడం లేదని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. 2010 బ్యాచ్‌ ఏఎ్‌సవోలు సింగిల్‌ యూనిట్‌లో ఇప్పటికీ సెక్షన్‌ అధికారులుగా కొనసాగుతుం డగా.. న్యాయ, ఆర్థిక విభాగాల్లో చేరిన అదే బ్యాచ్‌కు చెందిన వారు డిప్యూటీ, లేదా జాయింట్‌ సెక్రటరీ క్యాడర్‌లో పని చేస్తున్నారు. ఈ సమతుల్యతను సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు.. ఈ అంశం పై దృష్టి పెట్టకుండా ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి స్థాయి నుంచి మరో పదోన్నతి పొందేలా ప్రత్యేక కార్యదర్శి(నాన్‌ క్యాడర్‌) హోదా సృష్టించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు.


అయితే ఇదే క్రమంలో సింగిల్‌ యూనిట్‌లో 8, న్యాయ విభాగంలో 1 ప్రత్యేక కార్యదర్శి పోస్టులను ఏర్పాటు చేయాలని అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సింగిల్‌ యూనిట్‌లో 16 మంది డిప్యూటీ సెక్రటరీలు, ఏడుగురు జాయింట్‌ సెక్రటరీలు కలిపి 23 మంది సర్కులేటింగ్‌ అధికారులు ఉన్నారు. సింగిల్‌ యూనిట్‌ను బలోపేతం చేసేందుకు వీలుగా ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీలో ఒక అదనపు కమిషనర్‌ పోస్టును, సెక్రటరీ టు విజిలెన్స్‌ కమిషనర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో అడ్మిన్‌కు ఒక అదనపు డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేయాలని కోరింది. ఆరోగ్య శాఖలో ఫుడ్‌ కమిషన్‌లో ఒక సభ్య కార్యదర్శి పోస్టు, మైనార్టీ కమిషన్‌లో ఒకటి, రాజ్‌భవన్‌లో జాయింట్‌, డిప్యూటీ, అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులను పెంచాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సింగిల్‌ యూనిట్‌లో 316 సెక్ష న్లు ఉండగా వీటిలో 83 మంది అసిస్టెంట్‌ సెక్రటరీలు, 26 మంది డిప్యూటీ సెక్రటరీలు, 13 మంది జాయింట్‌ సెక్రటరీలు, 10 మంది అదనపు కార్యదర్శులు ఉన్నారు. దీంతో కీలక శాఖల నిర్వహణతో పని భారం ఎక్కువై సకాలంలో పనులు జరగడం లేదని పేర్కొంది.


ప్రతి సర్కులేటింగ్‌ అధికారి 4 నుంచి 5 సెక్షన్లు నిర్వహించాల్సి ఉన్నా.. చాలా మంది వద్ద ఏడుకుపైగా సెక్షన్లు ఉన్నాయి. సింగిల్‌ యూనిట్‌(జీఏడీ) పరిధిలో 316 సెక్షన్లకు 83 మంది సహాయ కార్యదర్శులు, 49 మంది సర్కులేటింగ్‌ అధికారులు ఉన్నా రు. ఆర్థిక శాఖలో 30 సెక్షన్లు, 19 మంది సహా య కార్యదర్శులు, 14 మంది సర్కులేటింగ్‌ అధికారులు ఉన్నారు. న్యాయ విభాగంలో 6 సెక్షన్లు, 4 అసిస్టెంట్‌ సెక్రటరీలు, ఆరుగురు సర్కులేటింగ్‌ అధికారులు ఉన్నారు. దీంతో పదోన్నతుల్లో అసమానతలు తలెత్తుతున్నాయని అధికారుల సం ఘం నివేదికలో పేర్కొంది. సహాయ కార్యదర్శి పదోన్నతికి సింగిల్‌ యూనిట్‌లో 7 సంవత్సరాలు పడుతుందని, న్యాయ, ఆర్థిక విభాగాల్లో మూడేళ్ల వ్యవధిలోనే పదోన్నతులు పొందుతున్నారని తెలిపింది.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:08 AM