Saraswati Pushkaralu Begins: సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 14 , 2025 | 02:31 AM
కాళేశ్వరంలో శ్రీ మాధవానంద సరస్వతి పుష్కరాలు రేపు ప్రారంభం. 17 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.

జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో రేపు ప్రారంభించనున్న శ్రీ మాధవానంద సరస్వతి
17 అడుగుల ఏకశిల సరస్వతీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
భక్తులకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
200 సీసీటీవీ కెమెరాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరుగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5:44 గంటలకు శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ప్రధానఘాట్ వద్ద మహబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి, కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు పుష్కర ఘాట్‌లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం సూర్యోదయం నుంచి ఈ నెల 26 వరకూ 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. పుష్కరాల ప్రతి రోజూ ఒక పీఠాధిపతి పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొనే అవకాశముంది. పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించిన రూ.35 కోట్లతో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేవాదాయశాఖ పుష్కర ఘాట్లు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, టెంట్ సిటీ, రోడ్ల మరమ్మత్తులు, పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టింది. హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నది. ఎటువంటి అవాంచనీయ ఘటనలకు చోటు లేకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైనభద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కాళేశ్వరంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సరస్వతి ఘాట్ సమీపంలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే హెలికాప్టర్ దిగడానికి హెలీప్యాడ్ నిర్మిస్తున్నారు. సాయంత్రం సరస్వతి హారతి ఆలస్యమయ్యేఅవకాశాలుండటంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే నేతృత్వంలో వందల మంది పోలీసులు కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పుష్కర ఘాట్ల నుంచి బస్టాండ్ వరకూ 200 సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక అఽధికారి అరవింద్ కుమార్, కలెక్టర్ రాహుల్ శర్మ మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సరస్వతి విగ్రహప్రతిష్టాపన ప్రాంతంలో సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.