Share News

Revanth Reddy: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:12 AM

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన పేలుడులో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పు న పరిహారం చెల్లించనున్నారు.

Revanth Reddy: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం

  • తీవ్ర గాయాలైతే 10 లక్షలు.. క్షతగాత్రులకు రూ.5 లక్షలు

  • సిగాచి యాజమాన్యం చెల్లించేలా సీఎం సమక్షంలో రాతపూర్వక ఒప్పందం

  • పేలుడుపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ

  • నివేదిక రాగానే కారణాలు వెల్లడిస్తాం

  • నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు

  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి

సంగారెడ్డి, రామచంద్రాపురం టౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన పేలుడులో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పు న పరిహారం చెల్లించనున్నారు. ప్రమాదంలో తీవ్రం గా గాయపడ్డవారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు. మృతుల అంత్యక్రియల కోసం రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నారు. ప్రమాదంలో మరణించిన, క్షతగాత్రుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం పరిహారం చెల్లించేలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు పరిహారం చెల్లింపు అంశంమీద సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో సిగాచి పరిశ్రమ యజమానులతో అధికారులు రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌ మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ, వివేక్‌తో కలిసి ఘటనా స్థలంలో సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలోనే మంత్రులు, డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సేఫ్టీ, ఇండస్ట్రియల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఘటన కు సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ యజమాని ఘటనా స్థలానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆయన స్వస్థలమైన గుజరాత్‌ రాష్ట్రానికి వెళ్లి నష్టపరిహారం గురించి మాట్లాడి రావాలని అధికారులకు సూచించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. మృతుల్లో తెలంగాణ, ఏపీ, బిహార్‌, ఒడిసా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు ఉన్నారని చెప్పారు. మృతులను గుర్తించి ప్రత్యేక అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియట్లేదని, వారి గురించి సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయని చెప్పారు. ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు సీఎస్‌ రామకృష్ణారావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్లక్ష్యం వ్యవహరించినవారు ఎవరైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇతర పరిశ్రమల్లో భద్రతా అంశాలపై దృష్టి పెడతామన్నారు. పరిశ్రమల నిర్వహణపై కొత్త విధానం తీసుకొస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుం డా మార్గాలు అన్వేషిస్తామని ఆయన పేర్కొన్నారు.


ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ

పరిశ్రమలో తీవ్రగాయాలపాలై పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. వారు పలు విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని మంత్రి దామోదరతోపాటు అధికారులను ఆదేశించారు.


మానవత్వంతో ఆదుకుంటాం

సీఎం రేవంత్‌ రెడ్డి మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి పరామర్శించారు. పలువురు సీఎంతో తమ కన్నీటిగాథలు చెప్పుకున్నారు. తన భర్త ఆచూకీ తెలియడం లేదని ఓ గర్భిణి విలపించింది. తమ కొడుకు ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ తల్లిదండ్రులు రోదించారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం మానవత్వంతో అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. పరిశ్రమ యాజమాన్యంతో నష్ట పరిహారం ఇప్పించడంతో పాటు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మృతులు, క్షతగాత్రుల పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తామని, అండగా ఉంటామని చెప్పారు.

Updated Date - Jul 02 , 2025 | 04:12 AM