RV Karnan: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
ABN , Publish Date - Oct 25 , 2025 | 07:57 AM
సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
- జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్
హైదరాబాద్ సిటీ: సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(RV Karnan) హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబరు 11న జరుగనున్న ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్ సమాచార చిట్టీలను పార్టీలు, అభ్యర్థులు పంపిణీ చేయవద్దని, అలా చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కర్ణన్ తెలిపారు. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓ) ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని, ఇతరుల ద్వారా పంపిణీ చేయిస్తే వారిపైనా చర్యలుంటాయన్నారు. 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఓటు వేసేందుకు తీసుకు రావాలని పేర్కొన్నారు.
ఇంటి నుంచే ఓటింగ్..
80 యేళ్లు దాటిన వయోధికులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటింగ్ చేయవచ్చని, ఇందుకోసం ఫారం-2 సమర్పించాలని సూచించారు. అర్హత ఉందని భావిస్తే పోస్టల్ బ్యాలెట్ అనుమతిస్తారని, ఎన్నికల అధికారులు ఇంటికి వచ్చి ఓటింగ్ చేయిస్తారన్నారు. ఇదిలా ఉండగా, ఉపఎన్నిక నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి తీసుకెళ్తోన్న నగదు, మద్యంలతో పాటు కానుకలు, నిషేధిత డ్రగ్స్‌ను పట్టుకున్నామని, వీటి విలువ సుమారు రూ.2.83కోట్లు ఉంటుందని కర్ణన్ తెలిపారు.

65 ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 65 సమస్యాత్మక ప్రాంతాల్లో 1,666 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఉంటుందన్నారు. ఎనిమిది కంపెనీల పారా మిలిటరీ బలగాలను కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరగా.. అంగీకరించిందన్నారు. జూబ్లీహిల్స్‌లో 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News