An Overloaded Tipper Accident: టిప్పర్ టెర్రర్
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:29 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో వికారాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు...
ఓవర్ లోడ్ కంకరతో ఆర్టీసీ బస్సును ఢీకొన్న వాహనం
వికారాబాద్-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం
ఘటనకు ముందు పలు వాహనాల్ని దాటిన టిప్పర్
గుంతను తప్పించబోయి బస్సు మీదకు నేరుగా..
డ్రైవర్ వెనక ఉన్న బస్సు భాగం నుజ్జునుజ్జు
టిప్పర్ ఒరిగిపడి కంకర కుప్పలా మారిన బస్సు
కంకర మీదపడి.. ఊపిరాడక ఎక్కువ మంది మృతి
అరగంటలోపే అందర్నీ వెలికితీసినా దక్కనిప్రాణాలు
8 మంది మృతదేహాలపై ఎలాంటి గాయాలూ లేవు
మృతుల్లో 13 మంది మహిళలు, ఒక పసికందు
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళుతోంది! టిప్పర్ చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళుతోంది! రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఉన్న మూల మలుపు వద్ద రెండూ ఎదురెదురుగా వచ్చాయి! 40 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్‌లో 55 టన్నుల కంకర వేశారు! లారీ బాడీని మించి కంకరను ఓవర్ లోడ్ చేశారు! దానికితోడు టిప్పర్ అతి వేగంగా దూసుకొచ్చింది! మూల మలుపులో ఓ చిన్న గుంతను డ్రైవర్ చూశాడు! దానిని తప్పించడానికి ప్రయత్నించాడు! అంతే.. అతి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు! అతి వేగం కారణంగా లారీ బ్యాలెన్స్ తప్పింది! లారీ బాడీ మొత్తం బస్సువైపు ఒరిగింది! అందులోని కంకర బస్సులో కుప్పగా పడిపోయింది! దాదాపు 20-30 టన్నుల కంకర మీద పడడంతో బస్సులో కుడివైపు ముందు భాగంలో కూర్చున్నవాళ్లు దాని కింద సజీవ సమాధి అయిపోయారు! ప్రమాదం కంటే కంకర కారణంగా ఎక్కువమంది దుర్మరణం పాలయ్యారు! రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర విషాదమిది!!
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ చేవెళ్ల/ మెయినాబాద్/పరిగి)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో వికారాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మంది గాయాలపాలయ్యారు. కంకర లోడ్‌తో వేగంగా వెళుతున్న టిప్పర్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును నేరుగా ఢీకొని, కుడిపక్క ఆరు సీట్లను నుజ్జు నుజ్జు చేసి, 55 టన్నుల కంకర లోడుతో బస్సుపై ఒరిగి పోయింది. పై నుంచి పోసినట్లుగా టన్నుల కొద్దీ కంకర మీద పడటంతో బస్సులో అనేక మంది అందులోనే సజీవ సమాధి అయ్యారు. టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. చేవెళ్లకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాగూడ గ్రామ శివారులో మూల మలుపు వద్ద గుంతను తప్పించేందుకు కుడివైపునకు వచ్చిన టిప్పర్ అనేక కుటుంబాల్లో విషాదానికి కారణమైంది. తాండూరు నుంచి సోమవారం తెల్లవారు జామున బయలు దేరి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (టీఎస్ 34టీఏ 6354) వికారాబాద్‌ను దాటింది.



మరోవైపు హైదరాబాద్ పటాన్‌చెరు సమీపంలోని ఇస్నాపూర్ నుంచి కంకర లోడ్‌తో టిప్పర్ వికారాబాద్ ప్రాంతానికి వస్తోంది. 40 టన్నుల కెపాసిటీ ఉన్న టిప్పర్‌కు 55 టన్నుల మేర బాడీకి మించి కంకరను పోశారు. దానికితోడు ప్రమాదానికి కాస్త ముందు టిప్పర్ పలు వాహనాలను వేగంగా దాటేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సును ఢీకొనగానే టిప్పర్ వెనుక లోడ్ ఉన్నభాగం కంకరతో సహా ముక్కలైన బస్సు క్యాబిన్‌లోకి ఒరిగిపోయింది. క్యాబిన్ మొత్తం కంకర గుట్టగా మారిపోయింది. ప్రమాద తీవ్రతకు బస్సు కుడిభాగం మొత్తం ధ్వంసం కాగా, టిప్పర్ ముందు భాగం నుజ్జయింది. ఈ ఘటనలో బస్సులో డ్రైవర్ వెనుక భాగంలో ఉన్న ఆరు లైన్లలో సీట్లలో కూర్చున్న వారంతా దాదాపు చనిపోయారు. వీరి మీద టిప్పర్‌లోని కంకర అంతా కుప్పగా పడిపోవడంతో బస్సులోనే ప్రాణాలు వదిలారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 72 మంది ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. కొందరు సీట్లు లేక నిలుచొని ఉన్నారు.తెల్లవారుజాము కావడంతో ప్రయాణికుల్లో అనేక మంది నిద్రపోతున్నారు. 6:40 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు భారీ శబ్దంతో కుదుపునకు గురి కావడంతో ఎవరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్లు తెరిచి చూసే సమయానికి పక్క సీట్లలో ఉన్న వారు ఏమయ్యారో తెలియదు. బస్సు నిండా కంకర, దుమ్ము. అనేక మంది కంకర కింద పడి చనిపోగా, కొంతమంది అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. ఇంతలో బస్సు వెనుక నుంచి, ముందు నుంచి వాహనాల్లో వస్తున్న వారు, పొలాల వద్ద ఉన్న వారు పలువురిని రక్షించారు. డ్రైవర్‌తో కలిపి బస్సులో మొత్తం 18 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు. ప్రమాద ఘటనలో టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుల్లో 13 మంది మహిళలు, 40 రోజుల వయసుగల ఒక శిశువు ఉన్నారు. మృతుల్లో వికారాబాద్ జిల్లా వాసులు 15 మంది ఉండగా ఇద్దరు హైదరాబాద్, ఒకరు కర్ణాటక, మరొకరు మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. గాయపడిన వారిలో 14 మందిని చేవెళ్ల పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీలో, 12 మందిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో 8 మందిని హైదరాబాద్‌కు తరలించారు. చేవెళ్ల ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి నుంచి హుటాహుటిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ నేతృత్వంలో ముగ్గురు డాక్టర్లను పంపినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు.
ఒక రోజు సెలవు కోసం వచ్చి
ఒక్క రోజు సెలవు కోసం హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చిన అనేక మందిని టిప్పర్ రూపంలో మృత్యువు కాటేసింది. మరో గంటన్నరలో హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్లు తనువు చాలించారు. బస్సులో 30 మందికి పైగా విద్యార్ధులు, ఉద్యోగులే ఉన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ సెలవులకు స్వగ్రామాలకు వస్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో సొంత ఊర్లకు వచ్చారు. తిరిగి సోమవారం ఉదయమే హైదరాబాద్‌కు వచ్చి చదువులకు, విధులకు వెళతారు. అందుకే సోమవారం ఉదయం లేదా సెలవు మర్నాడు ఈ బస్సు రద్దీగా ఉంటుంది.
హాహాకారాలు... అక్రందనలు
ప్రమాదంలో గాయపడిన వారంతా బస్సు నుంచి బయటపడేందుకు హాహాకారాలు, ఆక్రందనలు చేశారు. రోడ్డుపై ఇతర వాహనాల్లో వస్తున్న వారితో పాటు పొలాల వద్ద ఉన్న వారు వచ్చి కొందరిని రక్షించారు. పోలీసులకు ఫోన్ చేసి జేసీబీ యంత్రాలు తెప్పించారు. బస్సును కొందరు తమ వద్ద ఉన్న ఆయుధాలతో అద్దాలు పగలకొట్టి ప్రయాణికులను కాపాడారు. ఏదో విధంగా కంకర తొలగించి కొందరిని గాయాలతో బయటకు తీసుకొచ్చారు. కంకర తొలగించే సమయంలో ఊపిరాడక చనిపోయిన వారి శవాలు ఒకొక్కటిగా బయటపడ్డాయి. సగం కంకరలో ఇరుక్కు పోయిన వారు కాపాడాలని కేకలు వేస్తుండడం అందరినీ కంటతడి పెట్టించింది. నడుంలోతు కంకరలో కూరుకుపోయిన తోల్కొట్ట సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ టీచర్ జయసుధను స్థానికులు కాపాడారు. కేరెల్లికి చెందిన ఆమె వికారాబాద్‌లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు టీచర్లు ఈ బస్సు మిస్ అయ్యారు. ఇలా ఆ నలుగురు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. క్షతగాత్రులే ఎక్కువగా ఉండటంతో మొదట ప్రమాద తీవ్రత తెలియలేదు. కంకర కింద శవాల గుట్ట బయటపడడంతో అధికారులు, స్థానికులు విస్తుపోయారు.
అతి వేగమే ప్రమాదానికి కారణం
టిప్పర్ అతి వేగం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. టిప్పర్ వెనుక వస్తున్న వారు కూడా ఇదే విషయాన్ని అక్కడ చెప్పారు. బస్సు పరిమిత వేగంతోనే వస్తోందని, టిప్పర్ వాయువేగంతో వచ్చి మలుపు దగ్గర అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టి దానిపై పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య అధికంగా ఉండడానికి టిప్పర్‌లో అధిక లోడ్‌తో ఉన్న కంకరే కారణమని తేల్చారు. కంకర ప్రయాణికులపై కుప్పగా పడటమే ఎక్కువ ప్రాణ నష్టానికి కారణమైంది. దాదాపు ఎనిమిది మంది కంకర కింద కూరుకుపోయి ఊపిరాడక చనిపోయారని పోస్టుమార్టం చేసిన వైద్య సిబ్బంది ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, దీన్ని బట్టి ఊపిరాడకే చనిపోయినట్లుగాభావిస్తున్నామని చెప్పారు. టిప్పర్ కంకర తీసుకుని ఉదయం 4:30 గంటలకు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నుంచి బయలుదేరింది. టిప్పర్‌లో 55 టన్నుల కంకర లోడ్ చేసినట్లు తెలిసింది. టిప్పర్ బాడీపైకి కంకర ఉండడంతో బస్సుపై టిప్పర్ పడగానే ఒకేసారి కుప్పగా కంకర బస్సుపై పడిపోయింది. బస్సులో ఉన్న అనేక మంది దానికింద పడి ఊపిరాడక నిమిషాల్లోనే ప్రాణాలు వదిలారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు అరగంటలోపే బయటకు తీసినప్పటికీ అప్పటికే కొందరు ప్రాణాలు విడిచారు.


ప్రమాదానికి 45 నిమిషాలముందు మారిన డ్రైవర్లు
ప్రమాదానికి దాదాపు 45 నిమిషాల ముందు వరకు యజమానే టిప్పర్‌ను నడిపినట్లు తెలిసింది. టిప్పర్ యజమాని లక్ష్మణ్‌ది మహబూబ్‌నగర్ జిల్లా బాలాపూర్. భార్య లచ్చిరామ్ నాయక్ పేరు మీద టిప్పర్ కొన్నాడు. అతని దగ్గర మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బీజేవాడి గ్రామానికి చెందిన ఆకాశ్ ధన్యా కామ్లే టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి నుంచి కంకరటిప్పర్ నడుపుతున్నారు. సోమవారం ఉదయం 4:30కి ఇస్నాపూర్‌లోని ఓ క్రషర్‌లో కంకర లోడ్ నింపుకున్న తర్వాత అక్కడి నుంచి శంకర్‌పల్లి వరకు లక్ష్మణ్ నడిపించాడు. తనకు నిద్ర రావడంతో డ్రైవింగ్ నుంచి తప్పుకొని ఆకా్‌షకు డ్రైవింగ్ అప్పజెప్పాడు. ప్రమాద సమయంలో యజమాని నిద్రిస్తున్నట్లు సమాచారం. 45 నిమిషాల పాటు నడిపిన ఆకాశ్ మీర్జాగూడ మూల మలుపు దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఆకాశ్ మద్యం మత్తులో ఉన్నాడా? అనేది తేల్చేందుకు అతడి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. బస్సు కండక్టర్ రాధ ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయపడిన లక్ష్మణ్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మొదట వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. తలకు బలమైన గాయం కావడం, చెవుల్లో నుంచి రక్తం రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. వెంట పోలీసులు కూడా వెళ్లారు. ప్రమాదానికి దారితీసిన కారణాల గురించి పోలీసులు టిప్పర్ యజమాని లక్ష్మణ్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది.
19 మంది ప్రాణాలు తీసిన గుంత?
ఘోర ఘటనకు మూలమలుపు మీద ఉన్న గుంతే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు వెళ్లే రోడ్డుకు ఎడమవైపు గుంత ఉంది. టిప్పర్ డ్రైవర్ మలుపులో ఉన్న గుంతను చివరిక్షణంలో గుర్తించి వాహనాన్ని కాస్త కుడివైపు తిప్పాడు. ఈ క్రమంలో ఓవర్‌లోడ్‌తో ఉన్న టిప్పర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. తమవైపు దూసుకు వస్తున్న లారీ నుంచి తప్పించుకునేందుకు బస్సు డ్రైవర్‌కు ఎలాంటి మార్గం అక్కడ లేదు. అప్పటికే రోడ్డు చివరలో వెళుతోంది. కొన్నాళ్లుగా గుంత అలానే ఉంది. మరమ్మతులు చేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. మలుపులోని గుంత ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. మూలమలుపు, ఇరుకు రోడ్డు, రోడ్డుపై ఉన్న గుంతలతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు కూడా ఇదే భావిస్తున్నారు.
ట్రాఫిక్ జామ్
చేవెళ్ల ప్రమాదంతో వికారాబాద్-హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇరువైపులా దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పోలీసులు వికారాబాద్ వెళ్లే వాహనాలను శంకర్‌పల్లి మీదుగా మళ్లించారు. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎన్కేపల్లి మీదుగా మళ్లించారు. సంఘటన స్థలానికి అదనపు డీజీ మహేశ్ భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు వచ్చారు.



