Maheshwaram: మహేశ్వరంలో బీజేపీ నేత ఇంటి వద్ద రోహింగ్యాల రెక్కీ!
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:27 AM
మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి వద్ద రోహింగ్యాలు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు.. ఆరుగురి అరెస్టు
సరూర్‌నగర్, జూలై 4(ఆంధ్రజ్యోతి): మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి వద్ద రోహింగ్యాలు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. శుక్రవారం ఐదుగురు అనుమానిత యువకులను పార్టీ కార్యకర్తలు పట్టుకుని, మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు. మరో అనుమానిత రోహింగ్యా యువకుడు ఏకంగా శ్రీరాములు ఇంటి వద్దే తచ్చాడడం, అనంతరం సదరు యువకుడు తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి.. పారిపోవడం కలకలం రేపింది. గత కొంత కాలంగా తాను రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ.. అక్రమ మదర్సాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నానని, అందుకే తనను చంపాలనే ప్రణాళికతో రోహింగ్యాలు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరాములు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్తించారిలా..
మల్లాపూర్‌లోని అక్రమ మదర్సాను సందర్శించేందుకు శుక్రవారం ఉదయం శ్రీరాములు బయలుదేరాల్సి ఉండగా.. పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అదే సమయంలో పాత బైక్‌ను స్ర్కాప్ ట్రాలీగా మార్చుకున్న ఓ యువకుడు శ్రీరాములు ఇంటి వద్ద అనుమానాస్పదంగా తచ్చాడాడు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు వివరాలు అడుగుతుండగా..వాహనంపై పారిపోయాడు. ఆ యువకుడిని పోలీసులు బాలాపూర్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రీరాములు ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరిగిన ఐదుగురు రోహంగ్యా యువకులను బీజేపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. విచారణ జరుగుతోందని, ఇప్పుడే వివరాలు చెప్పలేమని మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. ట్రాలీతో తిరిగిన వ్యక్తి స్ర్కాప్ వ్యాపారం చేస్తాడని, మిగతా ఐదుగురు నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి