Share News

Hyderabad: దోపిడీ దొంగల బీభత్సం..

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:47 AM

ఇద్దరు దోపిడీ దొంగలు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌, హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో కాల్పులతో బీభత్సం సృష్టించారు. బీదర్‌లో ఓ ఏటీఎంలో జమచేయాల్సిన రూ.93 లక్షలను కొల్లగొట్టగా..

Hyderabad: దోపిడీ దొంగల బీభత్సం..

  • బీదర్‌లో సెక్యూరిటీ వాహనంపై దాడి.. గార్డు మృతి; మరొకరికి తీవ్రగాయాలు

  • ఏటీఎంలో నింపాల్సిన రూ.93 లక్షలతో పరార్‌.. హైదరాబాద్‌కు చేరిక

  • రాయ్‌పూర్‌ వెళ్లేందుకు యత్నం.. ఆబిడ్స్‌లో ఇద్దరికి బస్‌ టికెట్‌ కొనుగోలు

  • బ్యాగ్‌ తనిఖీతో ట్రావెల్స్‌ ఉద్యోగిపై కాల్పులు.. నిందితుల కోసం గాలింపు

బెంగళూరు, ఆబిడ్స్‌/మంగళ్‌హాట్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు దోపిడీ దొంగలు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌, హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో కాల్పులతో బీభత్సం సృష్టించారు. బీదర్‌లో ఓ ఏటీఎంలో జమచేయాల్సిన రూ.93 లక్షలను కొల్లగొట్టగా.. ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌కు పరారయ్యే క్రమంలో.. హైదరాబాద్‌లో కాల్పులు జరిపారు. బీదర్‌లో జరిపిన కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందగా.. మరొక గార్డు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో ఓ ట్రావెల్స్‌ ఉద్యోగికి తూటా గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. బీదర్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని ఏటీఎంలో నగదును నింపేందుకు సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది తమ వాహనంలో గురువారం ఉదయం 10.55 సమయంలో చేరుకున్నారు. వారు ఏటీఎం వద్ద వాహనాన్ని నిలిపి.. రూ.93 లక్షలున్న ట్రంకు పెట్టెను కిందకు దింపగానే.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. పిస్టల్‌తో ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గిరి వెంకటేశ్‌(40) అనే సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మరణించగా.. మరో గార్డు శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే దుండగులు ట్రంకుపెట్టెతో ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. అయితే.. దుండగుల చేతిలో తుపాకీ ఉండడంతో వెంబడించలేకపోయారు.


హైదరాబాద్‌కు దుండగులు

ఈ ఘటన జరిగిన వెంటనే బీదర్‌ పోలీసులు జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమై.. చెక్‌పోస్టుల వద్ద హైఅలెర్ట్‌ ప్రకటించారు. అయితే.. దుండగులు ట్రంకు పెట్టెలోని నగదును బ్యాగుల్లోకి మార్చుకుని, హైదరాబాద్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 సమయంలో ఆబిడ్స్‌ సమీపంలోని రోషన్‌ ట్రావెల్స్‌లో ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యపట్టణం రాయ్‌పూర్‌ వెళ్లేందుకు రూ.4,400 చెల్లించి, రెండు బస్‌ టికెట్లు తీసుకున్నారు. సాయంత్రం 6.30 సమయంలో బస్సు రాగా.. ట్రావెల్స్‌ సిబ్బంది ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకుని, వారి లగేజీని తనిఖీ చేసి, లోనికి అనుమతించారు. కాకతాళీయంగా కర్ణాటక పోలీసులు ఇద్దరు ఇదే బస్సులో ఉండగా.. తాము పోలీసులమని చెబుతున్నా.. ట్రావెల్స్‌ ఉద్యోగి జహంగీర్‌ వారి లగేజీని తనిఖీ చేశారు. ఏటీఎం దుండగులను కూడా బ్యాగులు చూపించాలని సిబ్బంది కోరగా.. రూ.50 వేలు ఇవ్వజూపారు. దాన్ని సున్నితంగా తిరస్కరించిన జహంగీర్‌.. బ్యాగులను తెరిచి, చూశారు. అందులో డబ్బుల కట్టలుండడంతో.. వారిని కిందకు దింపి, పోలీసులకు సమాచారం ఇస్తామని బెదిరించారు. దాంతో దుండగులు అతనిపై కాల్పులు జరిపి, పరారయ్యారు. జహంగీర్‌ కడుపు, తొడ భాగాల్లో తూటా గాయాలయ్యాయి. దాంతో.. ట్రావెల్స్‌ యజమాని అతణ్ని చికిత్స నిమిత్తం ఆస్రా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని, డీసీపీ బాలస్వామి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా దుండగుల అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 03:47 AM