CM Revanth: రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరు
ABN , Publish Date - May 02 , 2025 | 03:54 AM
రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి మే డే వేడుకల్లో తెలిపారు. కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని తీవ్రంగా విమర్శించారు.
ఆపాలనుకునే వారి కళ్లు, కాళ్లు కాలిపోతాయి
ఆర్టీసీలో సమ్మె పోటు రాష్ట్రానికే నష్టం
సమ్మె విషయంలో చర్చిద్దాం.. చేయగలిగింది చేస్తాం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు.. అందరూ సహకరించాలి
15 నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం
పదేళ్లలో రూ.8లక్షల కోట్లు ఎటు వెళ్లాయో తెలియట్లే
కపటనాటక సూత్రధారి కేసీఆర్ బయల్దేరాడు.. జాగ్రత్త
పథకాలు, వాటి అమల్లో తెలంగాణ నం.1గా నిలిచింది
కులగణనకు తెలంగాణ మోడల్‌ను పరిశీలించండి
కేంద్రానికి సహకరించేందుకు సిద్ధం: ముఖ్యమంత్రి రేవంత్
రాష్ట్రంలో పదేళ్లలో ఆర్ధిక ఉగ్రవాదం, విధ్వంసం జరిగింది. దేశంలో, రాష్ట్రంలో పేదవాళ్లు మరింత పేదవాళ్లయ్యారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్‌హౌస్‌లు, వ్యాపారాలు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. తప్పులు చేసి.. మళ్లీ ఇప్పుడు వచ్చి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారు. కొత్త ముసుగుతో కపటనాటక సూత్రధారి కేసీఆర్ మళ్లీ బయలుదేరాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- మే డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరని, ఎవరైనా ఆపాలనుకుంటే వారి కళ్లు, కాళ్లు కాలిపోతాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ అని, తెలంగాణ మోడల్‌నే కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. త్వరలో రాబోయే గిగ్ వర్కర్స్ పాలసీ కూడా దేశానికి రోల్ మోడల్ అవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, గిగ్ వర్కర్స్ పాలసీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, శాంతి భద్రతలను కాపాడడంలో, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో, నిరుద్యోగసమస్యను పరిష్కరించడంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. గురువారం కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ‘మే’ డే వేడుకలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీలో మళ్లీ సమ్మె అని చర్చలు చేస్తున్నారని, రాజకీయ నేపథ్యంలో ఎవరైనా సమ్మెకు ప్రోత్సహిస్తే మొత్తం సంస్థే దెబ్బతినే పరిస్థితి ఉంటుందని, సమ్మె పోటు రాష్ట్రానికే నష్టమన్నారు.
ఈ సందర్భంగా పంతాలకు, పట్టింపులకు వెళ్లకుండా చర్చిద్దామని, చేయగలిగింది చేస్తామని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వంలో సమ్మెల పేరుతో, ఇతర కారణాలతో.. తప్పు జరిగితే మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశాలు లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం బాగోలేదని, అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18,500 కోట్లు ఆదాయం వస్తుందని, వీటిలో రూ.6,500 కోట్లు అప్పులకు చెల్లిస్తున్నామని, రూ.6వేల కోట్లు జీతభత్యాలు, పింఛన్‌లకు ఇస్తున్నామని, ఇవి పోను మిగిలేది రూ.5,500 కోట్లేనని చెప్పారు. ఇందులోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కనీసం నెలకు రూ.22,500 కోట్లు ఉంటే ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతామన్నారు. కానీ రూ.12వేల కోట్ల ఆదాయం తక్కువ ఉందన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, అధికారులను కార్మికుల సంఘాల ముందు కూర్చోపెడతానని.. ఏది ఆపమంటారో, ఏది ఖర్చు చేయమంటారో చెప్పండన్నారు. ఈ విషయంలో ఒక అడ్వజైరీ బోర్డు పెట్టుకుని, సూచనలు చేయాలన్నారు. అణా పైసా కూడా తాను ఇంటికి తీసుకెళ్లడంలేదని, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడబోనని చెప్పారు. గడిచిన పదేళ్లలో ఒకటో తారీఖున జీతం పడిందా అని ప్రశ్నించారు, కానీ ప్రజాప్రభుత్వంలో మొదటి తేదీనే జీతం ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ ఒక్కరే 8లక్షల కోట్ల అప్పులు..
60ఏండ్లు, 16 మంది ముఖ్యమంత్రులు కలిసి రూ.72వేల కోట్లు అప్పులు చేస్తే.. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పు చేసిందని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2023 డిసెంబర్ 7న అధికారం తమకు వచ్చే నాటికి రూ.8.29లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. కాళేశ్వరం నిర్మించిన కాంట్రాక్టర్లకు రూ.1.02 లక్షల కోట్ల బిల్లులు చెల్లించారని, కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం కట్టడం, కూలడం జరిగిపోయిందన్నారు. రూ.1.02లక్షల కోట్లతో నిర్మించిన (సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ) ప్రాజెక్టులు కుప్పకూలిపోవడం ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. పేదోళ్లు కట్టుకునే గుడిసే కూడా కనీసం పదేళ్లు ఉంటుందన్నారు. రూ.8లక్షల కోట్లు ఎటు వెళ్లాయో కూడా ఆనవాళ్లు దొరకడంలేదన్నారు. 15 నెలల తమ ప్రభుత్వంలో రూ.1,58,000 కోట్ల అప్పులు చేస్తే.. ఇందులో రూ.1,52,000 కోట్లు బీఆర్‌ఎస్ చేసిన అప్పులకే చెల్లిస్తున్నామన్నారు. ప్రతీ నెలా సరాసరి రూ.10వేల కోట్లు అప్పులు చేసి కట్టాల్సి వస్తోందన్నారు. గడచిన 15 నెలలు తాను, సహచర మంత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నామని, అందరి సహకారం ఉండాలన్నారు.
హౌలా మాటలు మాట్లాడుతున్నారు..
పదేళ్లు అధికారంలో ఉన్న వ్యక్తి.. అధికారం కోల్పోవడంతో ఆ బాధ, ఆవేదన మొత్తాన్ని వరంగల్ సభలో చెప్పారని, 40ఏళ్లు అధికారం అనుభవించిన వ్యక్తికి అంత విషం ఉంటుందా అని రేవంత్... మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కడుపునిండా విషమేనని, మరో ఆలోచనే లేదన్నారు. అసెంబ్లీకి ఆయన పంపిన పిల్లలకే సమాధానం చెప్పడం లేదని అంటున్నారని, కానీ ఆయన పంపిన పిల్లలు (కేటీఆర్, హరీశ్) హౌలా మాటలు మాట్లాడుతున్నారని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెయ్యలేదని, కనీసం ప్రతిపక్ష నేతగానైనా చేసి, పాపాలను కొన్నింటినైనా కడుక్కోవాలని కేసీఆర్‌కు సూచించారు.
బీజేపీకి 400 సీట్లు వచ్చుంటే..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వాళ్లు అనుకున్నట్లుగా 400 సీట్లు వచ్చుంటే ఈ పాటికే రిజర్వేషన్లు రద్దయి ఉండేవని, రాజ్యాంగం రూపు రేకలే మారిపోయేవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రోజున కులగణన నిర్ణయమూ జరిగుండేది కాదన్నారు. రేవంత్‌రెడ్డి అమలు చేసిన దాన్ని మోదీ అనుసరిస్తున్నాడని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకులు కొంత అసూయ, దుఃఖంలో ఉన్నారని సీఎం ఎద్దేవా చేశారు. మోదీ ఏం ఆలోచిస్తున్నాడన్నది వారికి తెలియట్లేదని, ఈ పిల్లగాళ్ల మాటలను తాను పట్టించుకోమన్నారు. ఒత్తిడి, అవసరం మేరకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నా.. అంతిమంగా బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నారు.
రాజ్యహింసకు మా ప్రభుత్వం వ్యతిరేకం
హింసకు తమ ప్రభుత్వం, పార్టీ వ్యతిరేకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హింస.. రాజ్యం చేసినా, సామాన్యుడు చేసినా, సంఘాలు చేసినా దానికి తాము వ్యతిరేకమన్నారు. హింసకు బదులుగా చర్చలు జరగాలన్నారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అయినా అధికారికంగా తమ అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మావోయిస్టుల అంశంలో కేంద్రానికి ఏం సూచిస్తున్నారన్న ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు.
కులగణనలో దేశానికి మోడల్
రాహుల్ గాంధీ 150 రోజులు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలను కలుస్తూ.. వారి అభిప్రాయాలను సేకరించి.. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని సూచించారని అన్నారు. ఆయన సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమైందని, రాష్ట్ర ప్రభుత్వం చట్టం కూడా చేసిందన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా జనగణనలో కులగణన చేర్చి తొందర్లోనే ఎవరు ఎంతమంది ఉన్నారనే లెక్కలను తేలుస్తామని ప్రకటించిందన్నారు. దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ మోడల్‌ను పరిశీలించాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ విషయంలో కేంద్రానికి సహకరించేందుకు.. కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అధికారులను పంపితే కులగణన సర్వేకు సంబంధించి తమ అనుభవాలను, అభిప్రాయాలను వారితో పంచుకుంటామని చెప్పారు. లేదూ.. తమనే ఢిల్లీకి రమ్మన్నా వెళతామన్నారు. బలహీన వర్గాల ప్రయోజనాల కోసం ఒక మెట్టు దిగే విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలూ లేవని స్పష్టం చేశారు. ఆలస్యంగానైనా .. కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఈ ప్రక్రియను నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేయాలని, అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కీలకమన్నారు. ఎప్పటి కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ బీసీ ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నేతలతో కలిసి సీఎం మాట్లాడారు.
For Telangana News And Telugu News