Share News

Driving: పిల్లల డ్రైవింగ్‌.. పెద్ద సమస్యే.. వాహనం నడుపుతూ పట్టుబడితే అంతే

ABN , Publish Date - Jul 18 , 2025 | 09:42 AM

మీ పిల్లలకు (మైనర్లు) వాహనాలు ఇస్తున్నారా? అయితే మీకు తిప్పలు తప్పవు. వాళ్లు పట్టుబడితే వాహన రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ) ఏడాదిపాటు సస్పెన్షన్‌లో ఉండడమే కాదు, ఆ సమయంలో వాహన వినియోగానికి కూడా అవకాశముండదు. ఏమౌతుందిలే అని వాహనంతో రోడ్డెక్కితే జరిమానా, కేసుల నమోదుతోపాటు వాహనమూ సీజ్‌ చేసే అవకాశముంది.

Driving: పిల్లల డ్రైవింగ్‌.. పెద్ద సమస్యే.. వాహనం నడుపుతూ పట్టుబడితే అంతే

- తల్లిదండ్రులు/వాహన యజమానులపై కేసు

- ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఆర్‌సీ

- వాహనం నడిపేందుకూ నో చాన్స్‌

- పునరుద్ధరణ అంత సులువు కాదు

- నగరంలో పెరుగుతున్న మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు

- ఉల్లంఘనలపై రవాణా, పోలీస్‌ శాఖల స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌ సిటీ: మీ పిల్లలకు (మైనర్లు) వాహనాలు ఇస్తున్నారా? అయితే మీకు తిప్పలు తప్పవు. వాళ్లు పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(Registration certificate) (ఆర్‌సీ) ఏడాదిపాటు సస్పెన్షన్‌లో ఉండడమే కాదు, ఆ సమయంలో వాహన వినియోగానికి కూడా అవకాశముండదు. ఏమౌతుందిలే అని వాహనంతో రోడ్డెక్కితే జరిమానా, కేసుల నమోదుతోపాటు వాహనమూ సీజ్‌ చేసే అవకాశముంది.


1760లో 90శాతం నగరంలోనే..

మహానగరంలో మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1760 ఆర్‌సీలు సస్పెండ్‌ చేయగా, అందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే 1558 ఉన్నాయి. అంటే 90శాతం ఆర్‌సీలు ఇక్కడే సస్పెండ్‌ అయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 53, మేడ్చల్‌లో 40 ఆర్‌సీలూ సస్పెండ్‌ చేశారు. మోటారు వెహికిల్‌ చట్టం 1988లోని సెక్షన్‌199ఏ ప్రకారం ఆర్‌సీలు రద్దు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తోన్న నేపథ్యంలో బాధ్యులైన తల్లిదండ్రులు/వాహన యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టుకు పంపాలని పోలీసులు భావిస్తున్నారు.


డీఎల్‌ సస్పెన్షన్‌

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు పునరావృతమైతే పోలీసులు చట్ట ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌(డీఎల్‌)లను సస్పెండ్‌ చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు, ట్రాఫిక్‌ పోలీసుల సిఫారసుల ఆధారంగా వారం గడువుతో సంబంధిత వ్యక్తులకు షోకాజ్‌ నోటీసులిస్తోన్న ఆర్‌టీఏ.. వివరణ సహేతుకంగా లేకున్నా.. సమాధానం ఇవ్వకున్నా లైసెన్స్‌లను సస్పెన్షన్‌లో పెడుతోంది. 2024-25లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో 7,888 డీఎల్‌లు సస్పెండ్‌ చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 1,190లు డీఎల్‌ సస్పెండ్‌ చేశారు.


ఆర్‌సీ సస్పెండ్‌ చేస్తే..

మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే సదరు వాహనం ఆర్‌సీ యేడాదిపాటు రవాణా శాఖ రద్దు చేస్తుంది. ఆర్‌సీ సస్పెన్షన్‌లో ఉన్న సమయంలో వాహనం రోడ్లపైకి తీసుకురావడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. బయట తిరుగుతూ వాహనం పట్టుబడితే రిజిస్ర్టేషన్‌ వాలిడిటీ లేనందున పోలీసులు రూ.2000 వరకు రుసుము విధించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్‌ కంపెనీలు వాహనాల మరమ్మతు కు ఎలాంటి చెల్లింపులూ చేయవు. ప్రమాదం లో గాయపడిన, మరణించినా పరిహారం రాదు.


కోర్‌ ఏరియాలో అధికం...

కొందరు తల్లిదండ్రులకు తెలిసి వాహనాలు నడుపుతుండగా, ఇంకొందరు మాత్రం ఇంట్లో వాళ్లకు తెలియకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఇది ఆ పిల్లలకే కాకుండా ఇతర వాహనదారులకూ ప్రమాదకరంగా మారుతోంది. నగరంలో రహదారుల పై వాహనాలతో స్టంట్లు చేసే వారిలో ఎక్కువగా మైనర్లు కనిపిస్తుంటారు. రవాణా శాఖ ఖైరతాబాద్‌ కార్యాలయం పరిధిలో అత్యధికంగా 461, సికింద్రాబాద్‌లో 330 ఆర్‌సీలు సస్పెండ్‌ చేశారు. కోర్‌ ఏరియాలోనే మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం.


డీఎల్‌ సస్పెండ్‌ చేస్తే...

ఉల్లంఘనను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడు నుంచి ఆరు నెలలు రద్దు చేస్తారు. ఆ సమయంలో సదరు వ్యక్తి వాహనం నడపకూడదు. గడువు ముగిసిన అనంతరం తిరిగి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరోసారి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడనని అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలి. సస్పెన్షన్‌ సమయంలో వాహనం నడిపితే.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతున్నారన్న ఉల్లంఘన కింద జరిమానా విధిస్తారు. ద్విచక్ర వాహనదారులకు రూ.1000, మూడు నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారికి రూ.2000 ఫైన్‌ వేస్తారు. మూడు, నాలుగు పర్యాయాలు పట్టుబడిన పక్షంలో పూర్తిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకూ సిఫారసు చేసే అవకాశముంది.


మైనర్‌ డ్రైవింగ్‌ కేసుల్లో ఇలా..

రవాణా శాఖ కార్యాలయం.. రద్దు చేసిన ఆర్‌సీలు

ఖైరతాబాద్‌ (సెంట్రల్‌జోన్‌) 461

మలక్‌పేట (ఈస్ట్‌ జోన్‌) 212

సికింద్రాబాద్‌ (నార్త్‌జోన్‌) 330

బండ్లగూడ (సౌత్‌ జోన్‌) 255

టోలిచౌకి (వెస్ట్‌ జోన్‌) 300

మొత్తం 1558

రంగారెడ్డి జిల్లా 53

మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా 40


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 18 , 2025 | 09:42 AM