Share News

CM Revanth Reddy: లిక్కర్‌ స్కాంలో భాగస్వాములను ఓడించాం

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:50 AM

మద్యం కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న వాళ్లను తెలంగాణలో ఓడించామని, ఇక ప్రధాన భాగస్వామి అర్వింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించడానికి ఇప్పుడు ఢిల్లీకి వచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: లిక్కర్‌ స్కాంలో భాగస్వాములను ఓడించాం

  • ప్రధాన పాత్రధారి కేజ్రీవాల్‌నూ ఇంటికి పంపిస్తాం

  • ఢిల్లీకి మోదీ, కేజ్రీ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్‌

  • ఎన్నికల గ్యారెంటీలను ప్రకటించిన ముఖ్యమంత్రి

  • హామీల అమలు బాధ్యత తనదేనని భరోసా

న్యూఢిల్లీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న వాళ్లను తెలంగాణలో ఓడించామని, ఇక ప్రధాన భాగస్వామి అర్వింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించడానికి ఇప్పుడు ఢిల్లీకి వచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ మూడుసార్లు ప్రధాని అయినా, కేజ్రీవాల్‌ ఢిల్లీకి మూడు సార్లు సీఎం అయినా చేసిందేమీ లేదని విమర్శించారు. పేర్లు వేరయినా వారి చేతలు ఒక్కటేనని అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్‌ రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్‌ ప్రకటించారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, వంట సామగ్రి కిట్‌ (2 కిలోల పంచదార, లీటర్‌ వంట నూనె, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల టీ పొడి), 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీలను ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని, అందుకే ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నామని సీఎం అన్నారు. తెలంగాణలో 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు.


స్వతంత్ర భారత చరిత్రలో యూపీ, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోదీ.. 10 ఏళ్లలో 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని.. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 120 కోట్ల మంది మహిళలు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, అందుకు రూ.4 వేల కోట్లు ఆర్టీసీకి తమ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 50 లక్షల మంది రూ.500 సిలిండర్‌ పథకం, ఉచిత విద్యుత్‌ కింద లబ్ది పొందుతున్నారని చెప్పారు. తాము ఎన్నికల కోసం రాజకీయం చేయబోమని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు.


షీలా దీక్షిత్‌ మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పని చేసి మెట్రోతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేజ్రీవాల్‌, షీలా దీక్షిత్‌ చేపట్టిన అభివృద్ధి పనులను పోల్చి చూడాలని ఢిల్లీ ప్రజలను కోరారు. తమ పార్టీ ఇచ్చిన హామీలతో ఢిల్లీలో పేద ప్రజల స్థితిగతులు మెరుగవుతాయని, ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేసే బాధ్యత తనదని అన్నారు. అవినీతిని నిర్మూలిస్తే హామీలను నెరవేర్చవచ్చని, తెలంగాణలో తాము కేసీఆర్‌ అవినీతిని నిర్మూలించి హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పార్టీకి లోక్‌సభలో 100 మంది ఎంపీలు ఉన్నారని, ఢిల్లీ సమస్యలపై పార్లమెంటులో ఒత్తిడి తేగలమని, కేజ్రీవాల్‌ ఏం చేస్తారని రేవంత్‌ ప్రశ్నించారు.

Updated Date - Jan 17 , 2025 | 03:50 AM