Share News

Srisailam: సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు!

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:17 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆక్వా ఐ సోనార్‌ టెక్నాలజీ, గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌)తో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నించారు.

Srisailam: సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు!

  • ఆక్వా ఐ, జీపీఆర్‌ టెక్నాలజీతో గుర్తింపు

  • అవి మృతదేహాలు కావొచ్చు, కాకపోవచ్చు

  • ఆ ప్రాంతాల్లో బురదమట్టిని తవ్వుతున్న మైనర్లు

  • అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు.. నమ్మొద్దు

  • కార్మికుల గుర్తింపులో ప్రగతి ఉంటే చెప్తాం: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌/నాగర్‌కర్నూలు/దోమలపెంట, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆక్వా ఐ సోనార్‌ టెక్నాలజీ, గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌)తో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బురదలో ఐదు చోట్ల 13.500 కిలోమీటర్ల నుంచి 80-100 మీటర్ల పరిధిలో 6 అడుగుల లోతులో కొన్ని మెత్తని భాగాలను ఎన్‌జీఆర్‌ఐ బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాలను మార్కింగ్‌ చేసి, సింగరేణి మైనర్స్‌తో తవ్విస్తున్నారు. ఆ ప్రదేశాల్లో నాలుగు మీటర్ల మేర మట్టి, బురద ఉందని, డీవాటరింగ్‌ చేస్తున్నా నీటి ఊట వస్తూనే ఉందని సమాచారం. ఆ ఐదు ప్రాంతాల్లో తవ్వుతున్న బృందాలకు దుర్వాసన కూడా వచ్చినట్లు సమాచారం. అవి మృతదేహాలు కావొచ్చు, కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విషయం మీడియాలో వైరల్‌గా మారడంతో నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అది ఫేక్‌ న్యూస్‌ అని చెప్పారు. జీపీఆర్‌ ఆధారంగా ఎన్‌జీఆర్‌ఐ అధికారులు కొంత సమాచారం ఇచ్చారని, దాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాలు వాస్తవం కాదని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రస్తుతం బురద తొలగింపు, టీబీఎం కటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, కార్మికుల గుర్తింపును మొదటి ప్రాధాన్యంగా తీసుకొని పనిచేస్తున్నామని, ఎలాంటి ప్రగతి ఉన్నా మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. అప్పటివరకు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకుండా, సహకరించాలని సూచించారు. జీపీఆర్‌ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు బురద మట్టిలోకి ప్రవేశించి, అక్కడున్న వస్తువులు, భాగాలను గుర్తిస్తాయి. వాటి ఆధారంగా నమూనా చిత్రాలు అందుతాయి. మనిషి ఆకారాన్ని పోల్చిన చిత్రం వస్తే ఆ ప్రాంతంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీస్తారు. కాగా, సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై శుక్రవారం సింగరేణి సీఎండీ బలరాం విలేకరులతో మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న వారి జాడను ఇంకా గుర్తించలేదని తెలిపారు. 13.9 కి.మీ. దూరంలో టీబీఎం ముందు భాగం ఉందని, మిషన్‌ కటింగ్‌, బురద తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. సోషల్‌ మీడియాలో నకిలీ సమాచారాన్ని నమ్మొద్దని కోరారు.


నేడు ఎస్‌ఎల్‌బీసీ వద్దకు బీజేపీ బృందం

బీజేపీ ఎమ్మెల్యేల బృందం శనివారం ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లనుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్‌ఎల్‌బీసీ వద్దకు చేరుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • బీఆర్‌ఎ్‌సది అసత్య ప్రచారం: జూపల్లి

  • ఎస్‌ఎల్‌బీసీపై కేసీఆర్‌ శ్రద్ధ పెట్టలేదు: గుత్తా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేతలు ఉనికి కాపాడుకునేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మాజీ మంత్రి హరీ్‌షరావు సహా ప్రకృతి విపత్తును సైతం రాజకీయం చేసి పబ్బం గడుపుకొనేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించిందని, సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారని, మంత్రులుగా తాము క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీంలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కాగా, కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, దానిపై పెట్టిన శ్రద్ధలో 25ుఎస్‌ఎల్‌బీసీపై పెడితే ఎప్పుడో పూర్తయ్యేదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. రాజకీయంగా విమర్శలు మాని, ఘటనపై అన్ని పక్షాలు కలిసి ముందుకెళ్లాలని సూచించారు. ఘటన దురదృష్టకరమని, ప్రమాదాలకు భయపడి ప్రాజెక్ట్‌లు మూసుకుంటామా? అవాంతరాలు ఎదురైనా పూర్తిచేయాల్సిందేనన్నారు.


సొంతూళ్లకు కార్మికులు ఖర్చులకు పైసా ఇవ్వని కంపెనీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పనిచేస్తున్న జేపీ కంపెనీ కార్మికులు ప్రాణ భయంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. సొరంగంలో జరిగిన ప్రమాదంలో తమ సహచరులను కోల్పోయామనే బాధతో వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. టన్నెల్‌లో ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. తమకు కంపెనీ 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. ఊర్లోనే కూలి పనులు చేసుకొని తల్లిదండ్రులు, భార్యాబిడ్డలతో కలిసి బతుకుతామని చెబుతున్నారు. రవాణా ఖర్చులు అడిగితే కంపెనీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల ద్వారా డబ్బులు స్థానికుల ఖాతాలకు పంపించుకొని, వాటితో శుక్రవారం సొంతూళ్లకు బయలుదేరారు.

Updated Date - Mar 01 , 2025 | 05:17 AM