SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలకు తాత్కాలిక బ్రేక్
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:38 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది. సొరంగంలోని ఇన్‌లెట్ వైపు నుంచి 13.6 కి.మీ తర్వాత ముందుకెళ్లడం ఏ మాత్రం సురక్షితం కాదని కమిటీ అభిప్రాయపడింది. గురువారం జలసౌధలో సాంకేతిక కమిటీ సమావేశం రెవెన్యూ శాఖ (విపత్తులు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. దీనికి ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో పాటు ఏపీలోని ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ పదో బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ పరిశోధనా సంస్థ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూశాస్త్రవేత్త, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) సంస్థ నుంచి టన్నెల్ నిపుణులు పరీక్షిత్ మెహ్రా హాజరయ్యారు. తదుపరి సహాయక చర్యల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియో ఫిజికల్ రిసేర్స్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్‌తో పాటు బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్‌తో ఉప కమిటీని వేసి, అధ్యయనం అనంతరం సైట్ స్పెసిఫిక్ రిపోర్టును తయారు చేయాలని కమిటీ సూచించింది.
ఈ కమిటీ నివేదిక వచ్చేదాకా తదుపరి సహాయక చర్యల దిశగా ముందుకెళ్లరాదని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆర్మీ, జాతీయ విపత్తుల స్పందన సంస్థ(ఎన్‌డీ ఆర్‌ఎఫ్) బలగాలతో పాటు ర్యాట్ మైనర్లను సహాయక చర్యల నుంచి తప్పించి, వెనక్కి పంపించాలని నిర్ణయించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణితో పాటు రైల్వేకు చెందిన సిబ్బందితో టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) అవశేషాల తొలగింపు వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు. గత ఫిబ్రవరి 22న టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటిదాకా రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో ఆరుగురి ఆచూకి లభించలేదు. ఆ కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. సాంకేతిక ఉప కమిటీ నివేదిక చేతికి అందాక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ (దోమలపెంట) నుంచి తదుపరి టన్నెలింగ్ తవ్వకమంతా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News