Real Estate Scam: రియల్ ఎస్టేట్ పేరిట రూ.500 కోట్ల దోపిడీ
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:15 AM
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అతితక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు ఇస్తామన్నారు. వందలాది మంది నుంచి దాదాపు రూ.500 కోట్లు వసూలు చేశారు.
వందలాది మందిని మోసం చేసిన ఏవీ ఇన్‌ఫ్రా!.. పెట్టుబడిపై 50 శాతం లాభాలిస్తామంటూ ఎర
ఒక్కొక్కరి నుంచి పెద్దమొత్తంలో వసూలు
గడువు దాటినా డబ్బులు తిరిగివ్వని నిర్వాహకులు
సైబరాబాద్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
కేసు నమోదు.. ఈవోడబ్ల్యూ పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ సిటీ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అతితక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు ఇస్తామన్నారు. వందలాది మంది నుంచి దాదాపు రూ.500 కోట్లు వసూలు చేశారు. తీరా చెప్పిన సమయం వచ్చాక డబ్బులు తిరిగివ్వకుండా పరారయ్యారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. కావూరిహిల్స్ ఎస్‌వీ చాంబర్స్‌లో ఏవీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గోగుల లక్ష్మీ విజయ్‌కుమార్, గోగుల అన్నపూర్ణ అనే వ్యక్తులు ఈ మోసానికి పాల్పడ్డారు. మే 28నే కొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చిన బాధితులు శనివారం ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించి ఏవీ ఇన్‌ఫ్రా మోసాలను వివరించారు. భూపతి ప్రదీప్ అనే బాధితుడి ఫిర్యాదు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. గోగుల లక్ష్మీ విజయ్‌కుమార్, గోగుల అన్నపూర్ణ ఏవీ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తూ.. నగరంలోని పలు ప్రాంతాల్లో తమకు వెంచర్లు ఉన్నాయని చెప్పి ఏజెంట్లు, టెలికాలర్లను నియమించుకున్నారు. మూడు రకాల స్కీముల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించారు. మొదటి స్కీంలో.. తమ సంస్థలో రూ.10 లక్షల పెట్టుబడి పెడితే.. ఏడాదిలో 50 శాతం లాభంతో కలిపి రూ.15 లక్షలు చెల్లిస్తామన్నారు. రెండో స్కీమ్ కింద.. పెట్టుబడికి బదులుగా భూమి ఇస్తామని, ఆ భూమిని తిరిగి తామే కొనుగోలు చేసి పెట్టిన పెట్టుబడికి 50 శాతం లాభం కలిపి ఇస్తామని చెప్పారు. దీనికి బై బ్యాక్ స్కీమ్ అనే పేరు పెట్టారు. ఇక మూడో స్కీమ్ కింద.. ఫ్రీ లాంచ్ ఆఫర్‌లో తక్కువ ధరకే అద్భుతమైన సొంత ఇంటిని సమకూర్చి ఓ ఇంటివారిని చేస్తామని ప్రకటించారు.
ఘట్‌కేసర్‌కు తీసుకెళ్లి బురిడీ..
2022 ఫిబ్రవరిలో ఏవీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు.. నగరంలోని వనస్థలిపురంనకు చెందిన ఐటీ ఉద్యోగి భూపతి ప్రదీ్‌పను ఫోన్ ద్వారా సంప్రదించారు. అనంతరం తమ కార్యాలయానికి పిలిపించి మూడు స్కీములను వివరించారు. తమకు నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో రియల్ ఎస్టేట్ వెంచర్‌లు ఉన్నట్లు నమ్మబలికారు. అన్నీ విన్న ప్రదీప్.. మూడో స్కీమైన ప్రీ లాంచ్ ఆపర్‌పై ఆసక్తి చూపించారు. దీంతో ఆయనను ఏవీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని చూపించి.. ఇక్కడే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రెండేళ్లలో ఇళ్లను కట్టి అప్పగిస్తామని చెప్పి సంస్థ డైరెక్టర్‌లు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. దీంతో ప్రదీప్ రూ.19.45 లక్షలు చెల్లించారు. అయితే గడువు ముగిసినా భవన నిర్మాణం పూర్తికాకపోవడంపై ప్రదీప్ ప్రశ్నించగా.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంతకీ నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు వివరాలు ఆరా తీశారు. దాంతో సంస్థ యజమాని అసలు స్థలమే కొనుగోలు చేయలేదని, కేవలం స్కీములు మాత్రమే పెట్టి.. పలువురిని మోసం చేసి డబ్బులు దోచేసినట్లు గుర్తించారు. ఇలా తనతో పాటు.. 17 మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి నుంచి రూ.2.46 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఏవీ ఇన్‌ఫ్రా సంస్థ వందలాది మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. దాదాపు రూ. 400-500 కోట్ల వరకు మోసం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News