Share News

Batti Vikramarka: సభలో చర్చిద్దామంటే ప్రెస్‌క్లబ్‌లో రాద్దాంతం

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:54 AM

తెలంగాణ సిద్ధించాక రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో, ఏడాదిన్నర కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిపై గోదావరి, కృష్ణ జలాలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్దమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.

Batti Vikramarka: సభలో చర్చిద్దామంటే ప్రెస్‌క్లబ్‌లో రాద్దాంతం

అభివృద్ధి, నదీ జలాలపై మాట్లాడటానికి సిద్ధం.. అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రెస్‌ క్లబ్‌కు వెళ్లి రాద్దాంతం

  • వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు డిపాజిట్లు గల్లంతే: భట్టి

  • కేటీఆర్‌ పిచ్చికుక్కలా ఒర్లుతున్నడు: రామ్మోహన్‌రెడ్డి

  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

  • నేను స్పందించేంత స్థాయి కేటీఆర్‌ది కాదు: మహే్‌షగౌడ్‌

  • మీ నాన్నని ప్రతిపక్ష హోదా అడుక్కో: పొన్నం ప్రభాకర్‌

  • చెల్లెలి ఫోన్‌ ట్యాప్‌ చేసిన నీచ చరిత్ర నీది: అద్దంకి దయాకర్‌

  • రేవంత్‌ను అంటే కోసి కారం పెడతాం: కవ్వంపల్లి సత్యనారాయణ

హైదరాబాద్‌/మహబూబాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సిద్ధించాక రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో, ఏడాదిన్నర కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిపై గోదావరి, కృష్ణ జలాలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్దమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఇదే విషయంపై కేసీఆర్‌ సభలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిస్తే ఆయన రారు మేము వస్తామని కేటీఆర్‌ చివరకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌కు పోయి చర్చకు వచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనతో ముఖ్యమంత్రి చర్చకు రావాలంటూ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్‌ సవాళ్లు విసరడంపై భట్టి స్పందించారు. కృష్ణ, గోదావరి జలాలను ఇష్టం వచ్చినట్లు వాడుకోండని ఏపీ సర్కారుకు కేసీఆర్‌ చెప్పింది నిజం కదా? అని ప్రశ్నించారు. సంబంధిత వీడియోలను కూడాముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపించారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల పేరుతో లక్షన్నర కోట్లు ఖర్చు చేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టుమని పదెకరాలకు కూడా నీరందించలేదని ఎద్దేవా చేశారు. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కేటీఆర్‌ది తాను స్పందించేంత స్థాయి కూడా కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.


ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉందని, అసెంబ్లీలో ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలపైఅసెంబ్లీలోనే చర్చిస్తారని, కేటీఆర్‌కు చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. కేసీఆర్‌తో లేఖ రాయించుకుని, ఆయన వద్ద నుంచి ప్రతిపక్ష నేత హోదా తీసుకుని చర్చకు రావాలని కేటీఆర్‌కు సలహా ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ అయితేనే అంతా రికార్డుల్లో ఉంటుందన్నారు.

పిచ్చికుక్కలా ఒర్లుతున్న కేటీఆర్‌

సమస్యలపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్‌ లేఖ ఇస్తే సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కేటీఆర్‌, హరీశ్‌లకు సిగ్గు రాలేదని, పిచ్చికుక్కల్లా ఒర్లుతున్నారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల, సిద్దిపేటల్లో కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువగా రైతు రుణమాఫీ జరిగిందన్నారు. ఇది తప్పని నిరూపిస్తే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ, కేటీఆర్‌కు నిజంగా సమస్యలపై చర్చించే ధైర్యం ఉంటే డ్రామాలు ఆపేసి, తండ్రిని అసెంబ్లీకి తీసుకురావాలన్నారు. మదమెక్కిన కేటీఆర్‌ బజారున పడి, పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్‌ పేరు చెప్తే బీఆర్‌ఎస్‌ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. సొంత చెల్లె ఫోన్‌ ట్యాప్‌ చేసిన నీచ చరిత్ర కేటీఆర్‌దన్నారు. తెలంగాణను దోచుకున్న తండ్రీకొడుకులు జైలుకు వెళ్లక తప్పదన్నారు.


బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ ఆరోవేలు: యెన్నం

బీఆర్‌ఎస్‌ పార్టీలో కేటీఆర్‌ ఆరో వేలుగా మారిపోయాడని ఎమ్మెల్యే అన్నారు. కేసీఆరే ఆయనను పక్కన పెట్టాడని, సొంత చెల్లెలు కూడా కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవని చెబుతోందని, పార్టీ సీనియర్లూ మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంకోసారి రేవంత్‌పైఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కోసి కారం పెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ ఆస్పత్రిలో చర్చలు చేస్తున్నడు కాని అసెంబ్లీకి మాత్రం రావడం లేదని చెప్పారు. అచ్చోసిన ఆంబోతులా కేటీఆర్‌ మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలపైఓయూలో, సెంట్రల్‌ లైబ్రరీలో తనతో చర్చించేందుకు రావాలని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. రేవంత్‌పై మరోమారు చిల్లర మాటలు మాట్లాడితే కేటీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే ముందు కేసీఆర్‌ దగ్గర నుంచి ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రికి సవాల్‌ విసరాలంటే కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా ఉండాలన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 04:55 AM