Share News

Hyderabad: కోర్టులో పందెం కోడి ‘పాట’

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:45 AM

ఈ వేలం కోర్టు సాక్షిగా జరగడమే ఇక్కడ విశేషం! కండపుష్టితో దిట్టంగా ఉన్న ఆ కోడిని ఎవరు కొన్నా కోసుకుతింటారనే ఆందోళనతో ఓ పక్షి ప్రేమికుడు దాన్ని వేలంపాటలో దక్కించుకోవడం అంతకన్నా విశేషం!!

Hyderabad: కోర్టులో పందెం కోడి ‘పాట’

  • ఇటీవల పందెం రాయుళ్ల నుంచి స్వాధీనం

  • వేలంలో రూ.2,300కు కొన్న ఓ పక్షి ప్రేమికుడు

  • హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ కోర్టులో ఘటన

  • ఆయనకు, కోడి పుంజుకు దండ వేసి సన్మానం

రాజేంద్రనగర్‌, జనవరి26 (ఆంధ్రజ్యోతి): పందెం కోడి కోసం పలువురు వేలం పాటలో పోటీపడ్డారు. ఈ వేలం కోర్టు సాక్షిగా జరగడమే ఇక్కడ విశేషం! కండపుష్టితో దిట్టంగా ఉన్న ఆ కోడిని ఎవరు కొన్నా కోసుకుతింటారనే ఆందోళనతో ఓ పక్షి ప్రేమికుడు దాన్ని వేలంపాటలో దక్కించుకోవడం అంతకన్నా విశేషం!! ఈ ఘట్టానికి వేదికైంది ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ 13వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు! మరి.. ఈ కోడి కోర్టులోకెలా వచ్చింది? అంటే.. మొయినాబాద్‌లో కోడి పందేలు నిర్వహిస్తుంటే పోలీసులు వెళ్లి పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ పందెం కోడినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ కుక్కటాన్ని శనివారం కోర్టులోకి తీసుకొచ్చారు.


ఆ కోడిని న్యాయమూర్తి అంకిత్‌సర్వ ఆధ్వర్యంలో వేలం వేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గగన్‌పహాడ్‌ వాసి ఈ. రామకృష్ణ రూ.2,300 వెచ్చించి ఆ కోడిని పాడుకున్నారు. కోడిని ఏం చేస్తారు? అని ఆయన్ను అడిగితే.. ‘‘వేరెవరైనా పాడుకుంటే కోడిని కోసుకుతింటారని భయం వేసింది. అందుకే నేను పాడుకున్నాను. నా స్నేహితుడికి ఫామ్‌ హౌజ్‌ ఉంది. అక్కడ ఎన్నోరకాల పక్షులున్నాయి. ఈ కోడినీ పెంచేలా చూస్తాను’’ అని చెప్పారు. బంజరాహిల్స్‌లోని పందెం కోళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రామకృష్ణను సన్మానించారు. ఓ పక్షి ప్రేమికుడి చెంతకు చేరినందుకు ఆ కోడి మెడలోనూ అభినందన పూర్వకంగా దండ వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 04:45 AM