KTR: ఢిల్లీకి పారిపోయావేం
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:33 AM
తెలంగాణ రైతులు, నిరుద్యోగులకు ఎవరి ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రావాలన్న సీఎం రేవంత్‌రెడ్డి..
పారిపోవడం రేవంత్‌కు అలవాటే.. రచ్చ తప్ప చర్చ చేయడం రాదు
నువ్వు రాకపోతే.. డిప్యూటీ సీఎంను లేదా వ్యవసాయ మంత్రిని పంపు
సమయం, స్థలం చెప్పు.. ఈసారి రాకుంటే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి
కేటీఆర్ ధ్వజం.. పార్టీ నేతలతో ప్రెస్‌క్లబ్ వద్దకు.. సీఎం కోసం కుర్చీ!
మళ్లీ ఎప్పుడో నువ్వే చెప్పు: కేటీఆర్
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతులు, నిరుద్యోగులకు ఎవరి ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రావాలన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ సవాల్‌ను తాను స్వీకరించగానే ఢిల్లీకి పారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూరియా బస్తాల కోసం సీఎం ఢిల్లీకి వెళ్లారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ.. ఆయన వెళ్లేది పైసల మూటలు పంచడానికని ఆరోపించారు. తొడలు కొట్టడం, రంకెలు వేయడం, సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్‌కు అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరి.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పారని గుర్తుచేశారు. మంగళవారం పార్టీ నేతలతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్.. ‘సీఎం రేవంత్‌రెడ్డి కోసం’ అంటూ వేసిన కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం కొద్దిసేపు వేచిచూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు విసిరిన సవాల్‌ను స్వీకరించా. నీతో చర్చకు కేసీఆర్ రావడమెందుకు? నేనే వస్తానని చెప్పా. మాట ప్రకారం నేనొచ్చా.. నువ్వెక్కడ?’’ అంటూ సీఎం రేవంత్‌ని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదని తెలిసినా ముచ్చట పడుతున్నారని ఆయన సవాల్‌ను స్వీకరించానని, ప్రెస్‌క్లబ్‌కు వస్తే మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామని ఆహ్వానిస్తే చివరికి ఢిల్లీకి పరారయ్యారని ఎద్దేవా చేశారు.
మరోసారి వచ్చేందుకు సిద్ధం..
తనతో చర్చకు సీఎం రాకున్నా.. కనీసం డిప్యూటీ సీఎంనో, వ్యవసాయశాఖ మంత్రినైనా పంపాలని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక.. ఎక్కడ, ఎప్పుడు చర్చకు రావాలో రేవంత్‌రెడ్డి చెబితే వచ్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఈసారి కూడా చర్చకు సీఎం రాకపోతే.. తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. ‘‘కేసీఆర్‌పై మరోసారి తప్పుడు కూతలు కూయనని, పనికిమాలిన సవాళ్లు చేయనని రేవంత్ ముక్కు నేలకు రాయాలి’’ అని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయడమే తప్ప.. చర్చ చేయడం రాదన్నారు. బూతులు తప్ప రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్‌లేని అసమర్థ సీఎం అని, ఆయన పాలనతో 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోదావరి నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించేందుకు కడుతున్న బనకచర్లకు సీఎం రేవంత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగచాటుగా తీసుకెళ్తుంటే కళ్లు మూసుకొని చంద్రబాబుకు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నీళ్లను ఆంధ్రకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని, నియామకాలు తన తొత్తులకు ఇచ్చుకొని మురిసిపోతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతోపాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకూ పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు.
కొడంగల్‌లో 670 మందికి భరోసా రాలేదు
కాంగ్రెస్ చెబుతున్న రైతుభరోసా అంతా డొల్ల అని, సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే 670 మంది రైతులకు రైతుభరోసా రాలేదని కేటీఆర్ తెలిపారు. వారి వివరాలు తీసుకొచ్చానన్నారు. దీంతోపాటు రుణమాఫీ కాని లక్షల మంది రైతుల అధికారిక జాబితా తమ వద్ద ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు, వడ్లను ప్రభుత్వం కొనక, బోనస్ రాక.. మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, యూరియా, ఎరువుల బస్తా కోసం క్యూలో చెప్పులు పెట్టి ఫర్టిలైజర్ దుకాణాల ముందు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్.. నిజంగానే ఆ పాత దుర్దినాలను తీసుకొచ్చిందని విమర్శించారు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీని తలదన్నేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే గజగజ వణికిపోతున్న రేవంత్‌రెడ్డి స్థాయికి.. కేసీఆర్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆయనకు సమాధానం చెప్పే సత్తా బీఆర్‌ఎ్‌సలోని ప్రతి ఒక్క నాయకుడికీ ఉందని అన్నారు. ‘‘దళితులు, గిరిజనులు, పేదల పొట్టకొడుతున్న ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఘోరీ కట్టడంతోపాటు రేవంత్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.