Share News

Ramchander Rao: యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌ నియంత్రణలో సర్కారు విఫలం

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:03 AM

యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఎరువుల డీలర్లపై సరైన పర్యవేక్షణ లేదన్నారు.

Ramchander Rao: యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌ నియంత్రణలో సర్కారు విఫలం

  • ఫర్టిలైజర్‌ షాపులతో కాంగ్రెస్‌ నేతల కుమ్మక్కు

  • అవసరానికి మించి కేంద్రం యూరియా సరఫరా

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఎరువుల డీలర్లపై సరైన పర్యవేక్షణ లేదన్నారు. యూరియా సరఫరా వ్యవస్థపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం, ఫర్టిలైజర్‌ షాపులతో కొంత మంది కాంగ్రెస్‌ నేతలు కుమ్మక్కు కావడం వల్లే యూరియా కృత్రిమ కొరత తలెత్తుతుందని ఆయన చెప్పారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు పార్టీల నుంచి కీలక నేతలు బుధవారం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ జెండాలు కప్పి రాంచందర్‌ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం రైతులు బారులు తీరి, లైన్లలో గొడవలు, లాఠీచార్జీలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కానీ, మోదీ సర్కారు వచ్చిన తర్వాత కొరత లేకుండా యూరియా పంపిణీ చేస్తోందన్నారు. ప్రస్తుతం 9.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, 12.02 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసిందని ఆయన చెప్పారు.


అంటే అవసరానికి మించి యూరియా సరఫరా చేసిందన్నారు. కానీ, రాష్ట్రంలోని కొన్ని ఫెర్టిలైజర్‌ షాపుల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. బీసీలకు 42ు రిజర్వేషన్ల అమలుకు డిమాండ్‌ చేస్తున్న బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి బలం చేకూరుతుందని, అందుకే కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్నదని రాంచందర్‌ రావు ఆరోపించారు. త్వరలో జరిగే తన మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో నేతలు ఐక్యత ప్రదర్శించి ప్రజల్లో విశ్వాసం పెంచాలని కోరారు. పాత, కొత్త తేడా లేకుండా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి, బీజేపీని అధికారంలోకి తేవాలని ఆయన చెప్పారు.


26, 27 తేదీల్లో పాలమూరులో పర్యటన

ఈ నెల 26, 27 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాంచందర్‌ రావు పర్యటిస్తారు. 26న మహబూబ్‌నగర్‌, నారాయణ పేట జిల్లాలు, 27న గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 03:03 AM