Ponnam Prabhakar: ప్రజాపాలనలో బీసీ సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:56 AM
ప్రజాపాలనలో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.9,200.32 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
గురుకులాలపై అధికారులతో సమీక్ష
జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్, మారేడుపల్లి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.9,200.32 కోట్లు కేటాయించినట్టు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంకన్నా 2,971.32 కోట్లు అధికంగా విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభించేనాటికి విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్, ట్రంకుపెట్టె, బెడ్డింగ్ మెటీరియల్ అన్నీ సిద్ధంగా ఉంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ, కమిషనర్, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి తదతరులతో మంత్రి బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించి గురుకుల పాఠశాలల కార్యకలాపాలను సమీక్షించారు.
మార్చిన మెనూ ప్రకారం భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఆర్‌సీవోలు, జిల్లా అధికారులు తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. ఆహార పదార్థాల కొనుగోలు, నిల్వ, నాణ్యత, విద్యార్థుల ఆరోగ్యం, చదువు తదితర అంశాలపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలన్నారు. విశ్వకర్మ పథకం లబ్ధిదారులను గుర్తించాలని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించేవారికి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. కాగా సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్(జేబీఎ్‌స)ను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు భద్రత మాసంలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లతో మంత్రి మాట్లాడారు. బస్‌స్టేషన్‌లో సదుపాయాలు, సమస్యలపై ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్యాంటీన్‌లో ఆహార నాణ్యత పరిశీలించారు. బస్‌స్టేషన్‌లో ఉన్న స్టాళ్లను పరిశీలించి నాణ్యమైన సరుకులు విక్రయించాలని, కాలం చెల్లినవి విక్రయించినా... అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సికింద్రాబాద్ లాలాపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలనూ మంత్రి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎంని ఆయన నివాసంలో కలిసిన మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.