Ponguleti: ఇందిరమ్మ ఇళ్లు 600 చ.అడుగులకు మించొద్దు
ABN , Publish Date - May 03 , 2025 | 04:02 AM
ఇందిరమ్మ ఇళ్లను 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
400 అడుగులకు తగ్గొద్దు.. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో 500 ఇళ్లు
5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూ భారతి సదస్సులు
కలెక్టర్లు, ఎస్పీలతో పొంగులేటి
జూన్‌లో సర్వే మ్యాప్ ద్వారా ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లను 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. లబ్ధిదారులు ఈ మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టేలా కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి రామకృష్ణారావుతో కలిసి ఆయన భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్షకు ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగిరం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు, ఇన్‌చార్జి మంత్రుల నుంచి జాబితాకు ఆమోదం తీసుకోవాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500ఇళ్లను కేటాయించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. జాబితాలో ఎవరైనా అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం ఏ దశలో ఉన్నా రద్దు చేస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలను రూపొందించినప్పటికీ వాటితో సంబంధం లేకుండా నిరుపేదలనే పథకానికి ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు.
28 మండలాల్లో భూ భారతి సదస్సులు..
ఈ నెల 5 నుంచి 20 వరకు జిల్లాకో మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు పొంగులేటి తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31కల్లా పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు కాలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో సదస్సులను నిర్వహించామని తెలిపారు. ఈ నెల 4 నుంచి జరగబోయే నీట్ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్‌కు హాజరవుతున్నారని, 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు మంత్రి పొంగులేటి శనివారం ధ్రువపత్రాలను అందించనున్నారు.
జూన్‌లో సర్వే మ్యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు
జూన్‌లో సర్వే మ్యాప్ ఆధారంగా ప్రయోగాత్మకంగా భూముల రిజిస్ట్రేషన్లు చేస్తామని, త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్ల నియామకానికి ప్రకటన జారీ చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సర్వేయర్ల నియామకానికి 6వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుందని చెప్పారు. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. భూ భారతి వల్ల 70 శాతం ప్రజలకు లబ్ధి చేకూరినా తాము విజయవంతమైనట్లేనన్నారు.
21 మందికి పదోన్నతులు
రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది. గ్రేడ్-2లో పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్లు 10 మందిని గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులుగా పని చేస్తున్న 11 మందిని గ్రేడ్-2కి పదోన్నతులు కల్పించారు. శనివారం వీరికి మంత్రి పదోన్నతుల పత్రాలను అందించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News