Hyderabad: పోలీసులకు చిక్కిన దోపిడీ దొంగలు?
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:57 AM
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరిపి తప్పించుకున్న దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రహస్య ప్రదేశంలో విచారణ!
హైదరాబాద్ సిటీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరిపి తప్పించుకున్న దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాల్పుల అనంతరం దొంగలు అఫ్జల్‌గంజ్‌లో ఆటో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ మార్గంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు సేకరించారు. దొంగలు ఆ రోజు రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఎక్కడ దిగారు? ఆటోలో ఏం మాట్లాడుకున్నారు? ఎటు వెళ్లారు? అనే పలు కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం.
దోపిడీ దొంగలు బిహార్‌కు చెందిన అమిత్‌కుమార్, అనీశ్ గ్యాంగ్‌గా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. ఈ ముఠా బీదర్‌తో పాటు ఛత్తీ్‌సగఢ్‌లో కూడా బ్యాంకులో రూ.70లక్షలు దోచుకుని పరారైనట్లు గుర్తించారు. ముఠాలో ఎంతమంది ఉన్నారు? వారి కార్యకలాపాలు తదితర అంశాలపై రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడంలేదు. కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపి, ఏటీఎంలో జమ చేయాల్సిన రూ.93లక్షలతో పరారైన దోపిడీ దొంగలు హైదరాబాద్‌కు చేరుకోవడం.. ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్‌పైనా కాల్పులు జరపడం తెలిసిందే.