Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:59 AM
సర్వ హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ సోమవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభం కానుంది.

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రత్యక్ష వీక్షణకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ, హైదరాబాద్, కుషాయిగూడ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సర్వ హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ సోమవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభం కానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రులు మంత్రి జి.కిషన్ రెడ్డి, వి.సోమన్న, రవనీత్ సింగ్, బండి సంజయ్, గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తదితరులు హాజరవుతున్న ట్లు అధికారులు తెలిపారు. కాగా, జనవరి 7 నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్‌ప్రెస్ (17201-17202), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్- సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.
పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన
ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా జమ్మూ రైల్వే డివిజన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన రాయగడ రైల్వే డివిజన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు.